రేపటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు


హాజరు కానున్న 4,73,450 మంది…799 కేంద్రాల ఏర్పాటు
 హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగుస్తాయి. 799 పరీక్షా కేంద్రాలలో 4,73,450 (ప్రథమ: 3,13,647, ద్వితీయ: 1,59,803)మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 90 శాతం కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆదివారం ఇంటర్‌బోర్డు పరీక్షల నియంత్రణాధికారి సుశీల్‌కుమార్‌, అకడమిక్‌ సంయుక్త సంచాలకుడు భీమ్‌సింగ్‌, ఇతర అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎ.అశోక్‌ విలేకరులకు వివరాలు తెలిపారు. ‘మొదటిసారిగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. రికార్డు చేసిన సీడీలను హైదరాబాద్‌కు తెప్పించుకొని పరీక్షిస్తాం. వచ్చే మార్చి పరీక్షలకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. పరీక్ష పర్యవేక్షకులు(ఇన్విజిలేటర్లు) చరవాణులను తీసుకురాకూడదు. బయటకు ప్రశ్నపత్రాలు పంపకుండా నిరోధించేందుకు జీపీఆర్‌ఎస్‌ సాంకేతికతను వినియోగిస్తున్నాం. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాటిపై ప్రిన్సిపాల్‌ సంతకం లేకున్నా అనుమతిస్తాం. మూల్యాంకనాన్ని జూన్‌ 1నుంచి ప్రారంభిస్తాం. ఫలితాలనుజూన్‌ 25వ తేదీ లోపు విడుదల చేస్తాం.

గంట ముందుగా అనుమతి: ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9-12గంటల వరకూ, ద్వితీయ సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30-5.30 గంటల వరకు జరుగుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందుగా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మొదటి సంవత్సరం తెలుగు(ద్వితీయ భాష), మోడ్రన్‌ లాంగ్వేజెస్‌, తెలుగు, ఉర్దూ, రెండో సంవత్సరం- పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్ర, వాణిజ్య శాస్త్రం, భూగోళ శాస్త్రం, ప్రజా పరిపాలన శాస్త్రం సబ్జెక్టులకు మొదటిసారిగా హాజరయ్యేవారు కొత్త సిలబస్‌ ప్రశ్నపత్రాలు మాత్రమే తీసుకోవాలి.