రేపట్నుంచి ప్రత్యేక రైళ్లు.. టికెట్లు ఉన్నవారికే అమనుతి

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నుంచి కేంద్రం దాదాపుగా మినహాయింపులిచ్చింది. లాక్‌డౌన్ 5.0 ప్రకటించినప్పటికీ.. ఆంక్షలు కంటైన్మెంట్ జోన్లకే పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా కూడా గాడిన పడనుంది. అందులో భాగంగా.. జూన్ 1 నుంచి.. అంటే రేపటి నుంచి దేశవ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణించాలంటే టికెట్ రిజర్వేషన్ తప్పనిసరి. ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లతో రైళ్లు నడవనున్నాయి. జనరల్ కోచ్‌ల్లో ప్రయాణించాలన్న రిజర్వేషన్ టికెట్ ఉండాల్సిందే. టికెట్ ధర గతంలో మాదిరిగానే ఉంటుందని రైల్వే శాఖ ప్రకటించడం కొంత ఊరట కలిగించే విషయం.

మే 21, ఉదయం10 గంటల నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణం చేయాలంటే రైలు బయలుదేరే సమయానికి కనీసం 90 నిమిషాల ముందే రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారినే ప్రయాణించడానికి అనుమతిస్తారు. స్క్రీనింగ్ సమయంలో కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే ప్రయాణానికి అనుమతించేది లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.