రేవంత్‌ చౌకబారు ఎత్తుగడలు

 

సభ్యసమాజం ఛీ కొడుతోంది

నర్సాపూర్‌లో చేసిన వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్‌ మండిపాటు

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): రేవంత్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌ చీడపురుగు, పొలిటికల్‌ బ్రోకర్‌, రాజకీయ ఆంబోతు అంటూ శాసన మండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు గంగాధర్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో వారు విలేకరులతో మాట్లాడారు. నర్సాపూర్‌లో రేవంత్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పై, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తీవ్రంగా ఖండించారు. రేవంత్‌ వ్యాఖ్యలను సభ్య సమాజం ఛీ కొడుతోందని బోడకుంటి వెంకటేశ్వర్లు చెప్పారు. రేవంత్‌ టీడీపీని ముంచారని, ఇప్పుడు కాంగ్రెస్‌ ను ముంచబోతున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్‌ ఎపుడూ చంద్రబాబు మనిషేనని స్పష్టం చేశారు. చంద్రబాబు పంపిన డబ్బులతో పొగరెక్కి రేవంత్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీపై మణిశంకర్‌ అయ్యర్‌ అనుచిత వ్యాఖ్యలు చెస్తే రాహుల్‌ ఆయనపై చర్య తీసుకున్నారని, మరి రేవంత్‌ పై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. తెలంగాణ గాంధీ కేసీఆర్‌ను అనరాని మాటలంటే ఎవరూ ఊరుకోరని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. తమ సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. రేవంత్‌ స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌ చవకబారు మాటలతో కాంగ్రెస్‌ కే నష్టమన్నారు. సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

అన్ని ఉప ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్‌ చెల్లని నోటుగా మారిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గంగాధరగౌడ్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయం ఆ పార్టీ నేత మధుయాష్కీ గ్రహించాలని హితవు పలికారు. పేలని టపాకాయ కాంగ్రెస్‌ పార్టీయేనని, టీఆర్‌ఎస్‌ కాదన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ కు బ్రహ్మరథం పడుతున్నారని, వంద సీట్లు గెలిచి యాష్కీ నోరు మూయిస్తామని చెప్పారు. ప్రజల్లో బలంలేక యాష్కీ ప్రెస్‌ విూట్లకే పరిమితమయ్యారని, ఆయన ఇకనైనా నోరును అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌ రెడ్డి అని ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. నీతి, నిజాయతీకి తానేదో మారుపేరు అన్నట్టు ఓ దొంగ మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు. రేవంత్‌ తుపాకీ రాముడిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మంచితనం గురించి రేవంత్‌ కు రవ్వంత కూడా తెలియదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ తెలంగాణకు ఓ శిఖరమని, రేవంత్‌ రవ్వంత కూడా కాదన్నారు. తెలంగాణ తులసి వనంలో రేవంత్‌ ఓ గంజాయి మొక్క అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడంగల్‌ లో ఈసారి రేవంత్‌ ఓటమి ఖాయమన్నారు.