రైతాంగ సమస్యలపై చిత్తశుద్దిలేదు: రేవూరి

వరంగల్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి):తెలంగాణ రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారని.. వారికి తాము అండగా నిలుస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రైతన్నల సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతామన్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలకు ప్రధాన కారణం కేసీఆర్‌ తీరేనన్నారు. గ్రామాల్లో సిఎం పొలాల వెంబడి పర్యటిస్తే అసలు విషయాలు తెలుస్తాయని అన్నారు. ఎన్నికలకు ముందు రైతు సంక్షేమమంటూ ఎన్నో హావిూలు గుప్పించిన కేసీఆర్‌ పాలనా పగ్గాలు చేపట్టాక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రుణ మాఫీ సక్రమంగా అమలు కావడం లేదని ఏ రైతును అడిగినా చెబుతారని అన్నారు. ఓవైపు నకిలీ విత్తనాలు, మరో వైపు భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించు కోకుండా రైతులు సుభిక్షంగా ఉన్నారని ఎలా అంటారని అన్నారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి అన్నదాతలు ఆనందంగా ఉన్నారని వ్యాఖ్యానించడం తగునా అని అన్నారు. మూడున్నరేళ్లో ఏ ఒక్క హావిూని పూర్తి చేశారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. బంగారు తెలంగాణ అంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతాంగ సమస్యలపై అవగాహన లేదన్నారు. నూతన జిల్లాల్లో అధికారులను క్షేత్ర స్థాయిలో పరిశీలనకు పంపి వాస్తవాలను తెప్పించుకోవాలని రేవూరి సూచించారు.