రైతుకుకన్నీరు మిగిల్చిన మిర్చి

పెట్టుబడులు కూడా రాక ఆందోళన
వరంగల్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): మిర్చి సాగు రైతులను కన్నీరు పెట్టిస్తోంది. జిల్లావ్యాప్తంగా సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంట సాగు చేసిన రైతులపై కోలుకోలేని దెబ్బపడింది.ఈ ఏడాది జిల్లాలో మిర్చి సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం అంచనాలకు మించి పంట సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా పంట సాగు చేశారు. ఇతర పంటల కంటే మిర్చి పంట ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే ఆలోచనతో రైతులు మిర్చి సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరస్‌ తెగుళ్లు ఆశించి పంటకు నష్టం వాటిల్లింది. ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. దీంతో సాగుకయ్యే కనీస పెట్టుబడులు పూడకపోగా.. ఎకరాకు రూ.50వేల నుంచి రూ.60వేల మేరకు రైతులు నష్టపోయారు. ఇక కౌలు రైతులు మరో రూ.20వేల మేర నష్టాలను చవిచూస్తున్నారు. పండిన పంటకు కూడా ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబమంతా ఆరుగాలం శ్రమించినా ఎకరాకు మరో రూ.15వేల మేర నష్టం జరిగింది.
వర్షాలు, తుపాన్లు, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మిర్చి పంటకు తీరని నష్టం జరిగింది. వర్షాల కారణంగా గాలిలో తేమశాతం పెరగడంతో పంట తెగుళ్ల బారినపడింది.  ఏడాది ప్రతికూల పరిస్థితుల వల్ల జిల్లాలో సగటున ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.  ఈ ఏడాది కనీస దిగుబడులు కూడా రాలేదు.
సాగుకు ఎకరాకు నారు పోసింది మొదలు పంటను మార్కెట్‌కు చేర్చి.. విక్రయించే వరకు రూ.1.10లక్షల నుంచి రూ.1.20లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఈ ఏడాది ఎకరాకు సగటున 7 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తున్నాయి. ప్రస్తుత ధర క్వింటాల్‌కు సగటున రూ.7,500 వరకు పలుకుతోంది. అంటే ఎకరాకు పంట అమ్మితే రూ.52,500 వస్తున్నాయి. ఎకరాకు దాదాపు రూ.50వేల నుంచి రూ.60వేల మేరకు రైతు పెట్టుబడి నష్టపోతున్నాడు. ఇక కౌలు రైతు పరిస్థితి మరీ దయనీయం. ఈ రైతులు కౌలు మరో రూ.20వేల మేరకు నష్టపోతున్నారు.