రైతుబంధు పథకం పంపిణీలో నిర్లక్ష్యం

అనేక మందికి ఇంకా అందని సాయం
ఆదిలాబాద్‌,జూలై 23(జ‌నంసాక్షి): రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు చొప్పున గత రెండు సీజన్లలో అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు ఈ వానాకాలం సీజన్‌ నుంచి రూ.5 వేలకు పెంచి రైతుల ఖాతాలో జమ చేస్తోంది. రబీలో నేరుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేశారు. ఇదే పద్ధతిలో ఈ వానాకాలం సీజన్‌లో జమ చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో రైతుల వారీగా సాగు భూమి, బ్యాంకు ఖాతాలను ఎంఏఓలు పరిశీలించి, మండల వ్యవసాయాధికారికి పంపిస్తారు. ఆయన మరోసారి పరిశీలించి, జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి ఖజానా శాఖకు వెళ్తే వాళ్లు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. తొలివిడతలో అయిదు ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. జిల్లా మొత్తంలో ఇప్పటివరకు 81,680 మంది రైతుల ఖాతాల్లో రూ.121.15 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన రైతుల ఖాతాలను పరిశీలించి ఖజానా శాఖకు పంపించారు. విడతల వారీగా అక్కడి నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇచ్చే డబ్బులు ఇంకా కొంత మంది రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. గతంలో రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ.8వేల మొత్తాన్ని ఈ వానాకాలం నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇందులో భాగంగా తొలివిడతలో అయిదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే వీరిలో కూడా ఇంకా కొంత మంది రైతుల ఖాతాలకు డబ్బులు జమ కాలేదు. వీరితో పాటు అయిదు ఎకరాల భూమి కంటే పైన ఉన్న రైతులకు, అటవీహక్కు పత్రాలు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉంది.కొత్తగా పట్టాపాస్‌బుక్కులు పొందిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.. వారికి కూడా పెట్టుబడి సాయం అందించే అవకాశముంది. పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించే మొత్తం రూపాయలు గతంలో తీసుకున్న పంట రుణం వడ్డీకి కట్టి, ఈ ఏడాదికి తిరిగి పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకుంటున్నారు.