రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని అనుకోవడం మూర్ఖత్వమే అన్నారు.  రైతుల వెనుకబాటుకు కారణమైందని కాంగ్రెస్‌ అని, పదేళ్ల పాలనలో వారిని సర్వనాశనం చేవారని అన్నారు. కెసిఆర్‌ వచ్చాక, తెలంగాణ ఏర్పడ్డ తరవాతనే రైతులకు స్వర్ణయుగం మొదలయ్యిందన్నారు.  రైతులకు 24గంటల కరంటు, సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనతో కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని కోల్పోతోందని అన్నారు. పలు గ్రామాల చెరువులకు వారంలోగా గోదావరి జలాలు విడుదల చేస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. ఒకప్పుడు కరువుతో ఉన్న పల్లెలు ఇప్పుడు గోదావరి జలాల రాకతో కళకళలాడుతున్నాయ ని అన్నారు. ప్రతీ గ్రామంలో ఉన్న కాలువలను ఆ గ్రామానికి చెందిన రైతులు బాగు చేసుకుంటే నీరు త్వరగా వస్తుందన్నారు. ప్రతీ చెరువును గోదావరి జలాలతో నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు ఆ దిశగా కాలువలను శుభ్రం చేసుకోవాలన్నారు. గోదావరి నీరు వస్తోందని తెలియడంతో రైతులు సంతోషపడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక ప్రతీ పల్లెలో ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు కనబడుతున్నాయని పేర్కొన్నారు.