రైతులను పట్టించుకోని యోగి ప్రభుత్వం

తీవ్రంగా మండిపడ్డ ప్రియాంక వాధ్రా

కాంగ్రెస్‌ తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన సల్మాన్‌ ఖుర్షీద్‌

లక్నో,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి రైతులు కేవలం ప్రకటనల్లోనే కనిపిస్తారని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల ఓట్లు అవసరమే కానీ వారి కష్టాలు పట్టవా అంటూ బీజేప ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తాజాగా రాష్ట్రంలో వరదల కారణంగా పెద్ద మొత్తంలో పంట నష్టపోయిందని, అయితే రైతులకు నష్ట్‌ పరిహారం చెల్లించడం లేదని విమర్శించారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా వేధిస్తోంది. రుణమాఫీ పేరుతో వారిని మోసగించింది. కరెంటు బిల్లుల పేరుతో వారిని జైళ్లలో బంధిస్తున్నారు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. వాటికి ఎలాంటి నష్టపరిహారం లేదు. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి రైతులు కేవలం ప్రకటనల్లో కనిపిస్తారు. వారి ఓట్లు బీజేపీకి కావాలి కానీ, కష్టాలు పట్టవని ప్రియాంక అన్నారు. ఇదిలావుంటే రాహుల్‌ గాంధీ పార్టీని వీడి వెళ్లడం వల్ల కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా మారిందని సీనియర్‌నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా ఓడిపోయిందని, ఆ ఓటమి తర్వాత అవమాన భారంతో రాహుల్‌ పార్టీ అధ్యక్ష పదవిని వదిలేశారని, దాంతో పార్టీ వ్యవహారాలు ఆగమ్యగోచరంగా మారిందన్నారు. రాహుల్‌ మధ్యలోనే పార్టీని వదిలివెళ్లడం వల్ల ఆ పార్టీ మరింత దయనీయంగా మారిందన్నారు. మేం ఎంత వేడుకున్నా.. రాహుల్‌ మాత్రం అధ్యక్ష ¬దా నుంచి తప్పుకున్నారని, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు. పార్టీలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. రానున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం అసాధ్యమే అని సల్మాన్‌ కుర్షీద్‌ తెలిపారు. పార్టీని మరింతగా ముందుకు తీసుకుని వెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందన్నారు.