రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వం

జనగామ,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేయడంలేదని సిపిఎం జిల్లా నాయకులు జిల్లెల్ల సిద్దారెడ్డి అన్నారు. పేదలకు రెండు పడకల గదుల హావిూ, లక్ష ఉద్యోగాల వూసే లేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలను సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నా తెరాస నేతలు తామే అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకీ ఓటమి తప్పదని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రభుత్వం చెప్పినా ఏ ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సింగరేణి ఓపెన్‌కాస్టు-1 కోసం సుమారు 350 ఎకరాల భూమిని సేకరించారని ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదని అన్నారు. ఓపెన్‌కాస్టు-2 కోసం తమ గ్రామాన్ని, మిగిలిన భూములను తీసుకోవాలని సర్కారు భావిస్తుందని చెప్పారు. భూములు కొల్పోయిన రైతు కుటుంబాలకు పరిహారం అందించేలా సిపిఎం పోరాడుతుందని అన్నారు. 2013 కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం అందిస్తూనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి భూములు సేకరించేలా చేయాలని తెలిపారు.