రైతు సంక్షేమంలో తెలంగాణ దిక్చూచి

త్వరలోనే కోటి ఎకరాలకు సాగునీరిస్తాం

ఆగస్టు 15 నుంచి రైతుబంధు జీవిత బీమా పథకం అమలు

ఈ పథకం కింద 50లక్షల మందికి ప్రభుత్వం 1100కోట్లు ప్రీమియం చెల్లిస్తుంది

నెలాఖరులోగా ఫారంలో నామిని పేరుతో అధికారులకివ్వండి

రైతుబంధు బీమా అవగాహన సదస్సులో మంత్రి పోచారం

కరీంనగర్‌, జూన్‌18(జ‌నం సాక్షి) : రైతు సంక్షేమంలో తెలంగాణ దిక్సూచిగా నిలిచేలా కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులు, కరెంట్‌ కొరత లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సోమవారం కరీంనగర్‌లో రైతుబంధు బీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. తెలంగాణ రైతును దేశానికే ఆదర్శంగా నిలిపేలా కేసీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేసి కోటి ఎకరాలకు సాగునీరు అందించేలా కేసీఆర్‌ పట్టుదలతో ముందుకు సాగుతున్నారని, త్వరలోనే కోటి ఎకరాలకు రెండు పంటలకు నీళ్లు ఇస్తామని పోచారం పేర్కొన్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శం, దిక్చూచి అని తెలిపారు. రైతు బంధుతోఅన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తుందని, గతంలో పంటల సాగు సమయంలో వడ్డీ వ్యాపారుల, బ్యాంకుల చఉట్టూ రైతులు తిరగాల్సి వచ్చేందని, దీంతో అప్పులు పట్టక కొంతమంది రైతులు, పంటల సాగు ఆలస్యమైన సరిగా దిగుబడి రాక తెచ్చిన అప్పులు తీర్చలేక మరికొందరు మనోవేదనకు గురయ్యేవారన్నారు. రైతుబంధు పథకం కింద పెట్టుబడి ఖర్చులను ప్రబుత్వమే ఇవ్వడంతో రైతులు సంతోషంగా సాగుబాట పడుతున్నారని పోచారం పేర్కొన్నారు. దీనికితోడు రైతులు ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు ఆ తరువాత రైతు కుటుంబీకులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైతుబీమా పథకాన్ని కేసీఆర్‌ అమలు చేస్తున్నారన్నారు. ఆగష్టు 15నుంచి రైతు బంధు జీవిత బీమా పథకం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కింద 50 లక్షల మందికి ప్రభుత్వం 1100 కోట్ల ప్రీమియం చెల్లిస్తుందన్నారు. ఈ నెలాఖరులోగా రైతులకు ఇచ్చిన ఫారమ్‌లో నామిని పేరు రాసి వ్యవసాయ శాఖ అధికారులకు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, నాలుగేళ్లలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని తెరాస ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. దీంతో ఎక్కడ తమ అడ్రస్సు గల్లంతవుతుందోనని ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరు వాస్తవాలను గ్రహించకుండా రాజకీయ దుర్భుద్ధితో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన తీరు మార్చుకొని అభివృద్ధిలో కలిసి రావాలని పోచారం సూచించారు.