రైతు సంక్షేమానికి బాటు వేసిన కెసిఆర్‌

అర్థంకాని వారే విమర్శలు చేస్తున్నారు

ప్రాజెక్టుల పూర్తితో మారనున్న స్వరూపం: కొప్పుల

కరీంనగర్‌,జూలై27(జ‌నంసాక్షి): రైతులను ఆదుకునేందుకు ఎలా బాటలు వేయాలో సిఎం కెసిఆర్‌

చేసి చూపారని చీఫ్‌విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. తెలంగాణ వ్వయసాయ రంగంలో సిఎం కొత్త చరిత్రకు నాంది పలికారు. రైతును రాజు చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ గొప్ప ఆశయంతో తీసుకొచ్చిన రైతు బంధు పథకం కేవలం ఓ ముందడుగు మాత్రమేనని అన్నారు. చెరువుల పునురుద్దరణ కార్యక్రమాలు పూర్తయి, ప్రాజెక్టులు సాకారం అయితే గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుందన్నారు. అందరి దృష్టి తెలంగాణ వైపు ఆకర్షించేలా సిఎం కెసిఆర్‌ అభివృద్ది చేస్తున్నారని కొప్పుల అన్నారు. వ్యవసాయం తెలిసిన నేతగా సిఎం కెసిఆర్‌ తొలినాళ్ల నుంచే వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఆలోచనతో కార్యాచరణకు దిగారు. రైతులకు కావాల్సింది సకాలంలో నీరు రావడం.. నిరంతరాయంగా విద్యుత్‌ అందుబాటులో ఉండడం..పెట్టుబడి కోసం బ్యాంకులు విరవిగా రుణాలు ఇవ్వడం.. ఇలా చేస్తే మన పొలాల్లో వారు బంగారాన్నే పండిస్తారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలోని లేని విప్లవత్మాకమైన పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. కవిూషన్లకు కక్కుర్తి పడి, ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వకుండా లక్షకోట్లు ఖర్చుపెట్టి నిధులు దిగమింగిన వారికి నిజంగా ఇది అర్థం కాని వ్యవహారంగానే ఉంటుందని కాంగ్రెస్‌ తీరును దుయ్యబట్టారు. కేవలం ఓట్ల దృష్టితో చూసే వారికి ఇది ఓట్ల పండగ లాగనే ఉంటుంది. ఇది ఓట్లు కొల్లగొట్టే పథకమే అనిపిస్తుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచని, ఊహించని పథకం ఇదని చెప్పవచ్చు. ఈ పథకంతో సిఎం కేసిఆర్‌ దేశానికి కొత్త దారి చూపారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయం పరిస్థితి,ప్రస్తుత వ్యవసాయ పరిస్తితి చూస్తే మనకు తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. గతంలో రైతులకు కనీసం నాలుగుగంటలు కూడా కరెంటు రాక, విత్తనాలు, ఎరువులు దొరకక చెప్పులు క్యూలో పెట్టి ఎదురు చేసే రోజులను అప్పుడే ఎలా మరచిపోగలం. తొలుత తెలంగాణలో పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను వ్యవసాయానికి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందించే ఏకైక రాష్ట్రంగా తెలంగాణను దేశంలో ముందువరసలో నిలబెట్టారు. అదేవిధంగా రైతులకు లక్ష రూపాయలలోపు పంట రుణాల మాఫీని కూడా చేసిచూపారు. పంటరుణాలను నాలుగువిడతలుగా 17వేలకోట్ల రూపాయలు మాఫీ చేశారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క రైతు కూడా ఎరువులు, విత్తనాల కోసం క్యూలైన్లలో నిలబడే ఖర్మ లేకుండా చేశారు. ఇక నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అన్న నినాదం ఎత్తుకున్న సిఎం కేసిఆర్‌ దీనిని నిజం చేసేందుకు ప్రాజెక్టులను జెట్‌ వేగంతో నిర్మిస్తున్నారు. కాళేశ్వరం, దేవాదుల పనుల వేగం చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ ప్రాజెక్టులు కూడా పూర్తి అయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలు మారుతాయి. గ్రామాలు మళ్లీ జీవం పొందుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటాయి. హరితహారంతో పచ్చగా కనిపిస్తాయి. ఇలాంటి వాతావరణం చూడడానికి మరెంతో దూరం లేదని గుర్తించాలని అన్నారు. ఇవన్నీ చూడలేని వారంతా కాంగ్రెస్‌లో ఉండి విమర్శలు చేస్తున్నారని అన్నారు.