రైతు సమస్యల పరిష్కారానికే సమన్వయ కమిటీలు: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు. ఇది గిట్టని కాం/-గరెస్‌,టిడిపిలు యధావిధిగానే విమర్శలు చేస్తున్నాయని, వారు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారని అనుకోవడం లేదన్నారు. శుక్రవారం 32వ డివిజన్‌ న్యూషాయంపేట్‌ వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు సమాలోచన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనివల్ల రైతులంతా కలిసికట్టుగా ఏర్పడి తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించుకునే అవకాశం ఉందన్నారు. గిడ్డంగుల నిర్మాణంతో పాటు రైతులకు స్వయం ప్రతిపత్తి లభించే అవకాశం ఉందన్నారు. పదిహేను మంది సభ్యులతో సమన్వయ కమిటీని స్థానికుల సమక్షంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉడా ఛైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్‌ అరుణ, తహసీల్దారు రవీందర్‌, ఏవో శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.