రైతు సమితులపై విమర్శలు తగవు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితులను కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. దీంతో మంచి జరుగుతుందా లేదా అన్న చర్చ చేయకుండా విమర్శలు చేయడం తగదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వరాష్ట్రంలో తొలిసారిగా రైతులతో సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమితి సభ్యులతో అధికారులు బృందాలుగా ఏర్పడి ఒక్కో గ్రామంలో నెలకొన్న భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు దోహద

పడుతాయన్నారు. రైతు సమితి సభ్యులకు గ్రామస్తులు సహకరించాలన్నారు. తద్వారా ప్రభుత్వం ఎకరానికి రెండు పంటల ఖర్చులకు రూ.8 వేల చొప్పున అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు.

రైతులను సంఘటితం చేసేందుకే రైతు సమన్వయ సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అన్నారు. గ్రామ స్థాయిలో 15 మంది రైతులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందులో ఐదుగురు మహిళా రైతులు ఉంటారని సూచించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలోనూ ఈ సమన్వయ సమితులను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారన్నారు. రాబోయే కాలంలో రైతు సమితుల ద్వారానే పంటల కొనుగోళ్లు సైతం చేస్తామన్నారు. దీంతో పాటు రైతులకు 9 గంటల ఉచిత కరెంటు సైతం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. గతంలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేదని, ప్రస్తుతం ముందస్తుగానే ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామన్నారు. ఇకపోతే రైతు సమన్వయ సమితుల ఏర్పాటు పక్రియ జిల్లా వ్యాప్తంగా శరవేగంగా సాగుతోంది. షెడ్యూల్‌ ప్రకారం వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని రెవెన్యూ గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికలు తయారు చేశారు. రైతులు సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ సమితుల ఏర్పాటు పక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 1న ప్రా రంభమైన ఈ పక్రియ చివరిదశకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 509 రెవెన్యూ గ్రామాలుండగా ఇప్పటి వరకు 487 గ్రామాల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. గడువులోపు రెవెన్యూ గ్రామాలు, మండలాలు, జిల్లా సమితులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లోని రైతు సమన్వయ సమితుల ఏర్పాటు పక్రియ పక్కాగా జరుగుతోంది. గ్రామాల్లో ఉంటూ వ్యవసాయం చేస్తున్న వారినే సభ్యులుగా తీసుకుంటున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల వివరాలను సేకరించి వారు పట్టాదారుగా ఉండి వ్యవ సాయం చేస్తున్నారా? లేదా అనే విషయాన్ని తెలియ జేస్తున్నారు.