రైల్వేను నిందించడం సరికాదు

– ఉత్సవాల గురించి రైల్వేకు సమాచారం ఇవ్వలేదు
– రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని లొహాని
న్యూఢిల్లీ, అక్టోబర్‌20(జ‌నంసాక్షి) : అమృత్‌సర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో రైల్వేను నిందించడం సరికాదని, పట్టాలపక్కన దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులకు ఎలాంటి సమాచారం లేదని రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని లొహాని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అమృత్‌సర్‌, మానావాలా రెండు స్టేషన్ల మధ్య ప్రాంతంలో ప్రమాదం జరిగిందని, అది లెవల్‌ క్రాసింగ్‌ కూడా కాదని అన్నారు. స్టేషన్ల మధ్య ప్రాంతాల్లో పట్టాలపై రైళ్లు నిర్ణీత వేగంతో వెళ్తాయని, ప్రజలు ట్రాక్‌లపైకి వస్తారని ఊహించబోమని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాల్లో రైల్వే స్టాఫ్‌ కూడా ఉండరని అన్నారు. లెవల్‌
క్రాసింగ్‌ల వద్ద మాత్రమే రైల్వే సిబ్బంది ఉండి, ట్రాఫిక్‌ను నియంత్రిస్తారని చెప్పారు. రైల్వే సిబ్బందిని ఎందుకు అప్రమత్తంగా ఉంచలేదని అడిగిన ప్రశ్నకు లొహాని పై విధంగా స్పందించారు. జలంధర్‌ -అమృత్‌సర్‌ రైలు నిర్ణీత వేగంతోనే ప్రయాణిస్తోందని, రైలును ఆపేందుకు డ్రైవర్‌ అత్యవసర బ్రేక్స్‌ కూడా వేసినట్లు తెలిసిందని ఆయన వెల్లడించారు. రైల్వే స్థలానికి ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలంలో ఉత్సవాలు జరిగినట్లు లొహాని తెలిపారు. పట్టాలపైకి రావొద్దని ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము ప్రచార కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నామని, వాటిని మరింత విస్తృతం చేస్తామని చెప్పారు.
ట్రైన్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు..
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సిటీకి సవిూపంలోని జోడా ఫాటక్‌లో విజయదశమి సందర్భంగా రైలు పట్టాలపై నిలబడి రావణ దహనం చూస్తున్న వారిపైకి రైలు దూసుకొచ్చిన ఘోర ప్రమాదంలో సుమారు 61 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రమాదానికి కారణమైన రైలు డ్రైవర్‌ను పంజాబ్‌, రైల్వే పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై పంజాబ్‌ పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. డీఎంయూ ట్రైన్‌ డ్రైవర్‌ను లుధియానా రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. జోడాఫాటక్‌ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం ఘటనపై లోకోపైలెట్‌ను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. డ్రైవర్‌ కూడా పోలీసుల ప్రశ్నలకు బదులిచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రైలు వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మార్గంలో వెళ్లేందుకు తనకు అనుమతి లభించడంతోనే తాను రైలును ముందుకు నడిపించానని, ఆ ప్రాంతం గుండా రైలు వెళ్తున్నప్పుడు వందలాది మంది ప్రజలు రైల్వే ట్రాక్‌పై నిలబడి ఉంటారని తాను ఊహించలేదని ఈ సందర్భంగా డ్రైవర్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్లు సమాచారం.