రైల్వేశాఖపై కాగ్‌ సీరియస్‌!

న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : కంట్రోరల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రైల్వేశాఖపై తీవ్రంగా మండిపడింది. దేశవ్యాప్తంగా రైళ్లు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం, స్టేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నారు తప్ప రైళ్ల రాకపోకలను పట్టించుకోవడం లేదని పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో కాగ్‌ అసంతృప్తి వ్యక్తంచేసింది. స్టేషన్ల ఆధునీకరణ అన్నది కనీస మౌలిక వసతులపై కూడా దృష్టి సారించాలని సూచించింది. స్టేషన్ల అభివృద్ది ప్రధానంగా ప్రయాణికులకు సౌకర్యాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నది. కానీ రైళ్ల ఆలస్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు అని కాగ్‌ తన నివేదికలో స్పష్టంచేసింది. నివేదిక రూపొందించడంలో భాగంగా దేశవ్యాప్తంగా 15 స్టేషన్లను ప్రామాణికంగా తీసుకుంది. ఈ స్టేషన్లలో రైళ్ల రాకపోకలు భారీగా పెరిగిపోయాయని చెప్పింది. కానీ ఆ స్థాయిలో ప్లాట్‌ఫాంలు, వాషింగ్‌ పిట్‌లను మాత్రం అభివృద్ధి చేయడం లేదని విమర్శించింది. ఆ 15 స్టేషన్లలో మార్చి 2017నాటికి 2436 రైళ్లు నడుస్తున్నాయని, అందులో 638 రైళ్లు 24 అంతకంటే ఎక్కువ కోచ్‌లతో నడుస్తున్నాయని పేర్కొంది. కానీ ఆ స్థాయి ప్లాట్‌ఫాంలు మాత్రం లేవని కాగ్‌ తన నివేదికలో తెలిపింది. ప్రధానంగా ప్లాట్‌ఫాంల కొరత కారణంగానే రైళ్లను ముందు స్టేషన్లు లేదా ఔటర్‌ సిగ్నళ్ల దగ్గర ఆపేస్తున్నారని కాగ్‌ స్పష్టంచేసింది. అన్ని రైల్వే జోన్లు స్టేషన్ల అభివృద్ధికి ఓ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించుకోవాలని కాగ్‌ సూచించింది. ముందు ప్లాట్‌ఫాంల సంఖ్య పెంచేలా స్టేషన్ల అభివృద్ధి జరగాలని స్పష్టంచేసింది.