రైల్వే క్రాసింగ్‌లు, రోడ్ల మలుపులు


మిషన్‌ భగీరథకు ప్రధాన అడ్డంకులు
చురుకుగా సాగుతున్నా తప్పని తిప్పలు
ఖమ్మం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): ఇంటింటికి తాగునీరు అందించేందుకు చేపట్టిన  మిషన్‌ భగీరథ పనుల్లో జాప్యం జరుగుతోంది. సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో మొదటిదశలో నిర్దేశిరచిన సమయానికి తాగునీరు సరఫరా చేసే అవకాశం లేకుండాపోయింది. పాలేరు, వైరా, గోదావరి నీటివనరుల నుంచి ఆయా గ్రామాల వరకు పైపులైన్ల పనులు పూర్తవుతున్నప్పటికి అక్కడి నుంచి తాగునీటిని అందించే వనరులు ఇంకా అందించాలంటే ఇంట్రావిలేజ్‌ నిధులతోనే చేయాల్సి ఉంది. మిషన్‌ భగీరథ పనుల్లో అధికారులకు  రైల్వేక్రాసింగ్‌లు, జాతీయ, రాష్టీయ్ర రహదారి వద్ద పైపులైన్లను దాటించడం కష్టంగా మారింది. ఇలా రెండు జిల్లాల్లో సుమారు 35 వరకు రైల్వేక్రాసింగ్‌లున్నాయి. మరో ప్రధాన ఇబ్బందికర పనుల్లో జాతీయ, రాష్ట్ర రహదారి మార్గాలను దాటుతూ వేయాల్సిన పనులు కూడా ఈ కోవలేనే ఉన్నాయి. ఇలా ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు సుమారు 18 చోట్ల రోడ్డుదాటించేలా పనులు చేపట్టారు. ఇంకా పూర్తిచేయాల్సి ఉంది. పాలేరు గ్రిడ్‌ పరిధిలో ఖమ్మం కార్పొరేషన్‌, చింతకాని, ధంసలాపురం వద్ద మొత్తం 6 రైల్వేక్రాసింగ్‌ల వద్ద భగీరథ తాగునీటి ప్రధాన పైపులైన్లను వేయాల్సి ఉంది. వైరా గ్రిడ్‌ పరిధిలో బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం వద్ద మూడు రైల్వే క్రాసింగ్‌లున్నాయి. ఈ రెండు గ్రిడ్ల పరిధిలో మొత్తం తొమ్మిది క్రాసింగ్‌లు ఉండగా నాలుగు పనులు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లా పరిధిలో మణుగూరు, పినపాక వద్ద ఆరు రైల్వేక్రాసింగ్‌లు ఉండగా కొత్తగూడెం నుంచి డోర్నకల్లు మార్గంలో 20 వరకు ఉన్నాయి. అత్యధికంగా కారేపల్లి మండలంలో ఏడు రైల్వేక్రాసింగ్‌ పనులు జరగాల్సి ఉంది. ఈ పనులు మరింత ఇబ్బందికరంగా ఉన్నాయి.రెండోదశలో తాగునీరు అందించాల్సి ఉన్న పనులకు సంబంధించి ఇవి ముడిపడి ఉన్నాయి. వీటికితోడు వైరా గ్రిడ్‌ పరిధిలో అటవీ అనుమతులు రావడం ఆలస్యం కావడం మరో కారణంగా కూడా ఉందని చెప్పొచ్చు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మిషన్‌ భగీరథ కింద ఇంటింటికి తాగునీటిని అందించేందుకు రూ.3,600 కోట్లు కేటాయించారు. ఖమ్మం జిల్లాలో వైరా, పాలేరులను గ్రిడ్లుగా విభజించి ఇక్కడి నుంచి తాగునీరు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం, దుమ్ముగూడెం కేంద్రంగా గోదావరి సెగ్మెంట్‌ను గ్రిడ్‌గా ఏర్పాటు చేశారు. ఉభయ జిల్లాల్లోని మూడు గ్రిడ్లకు మొదటిదశ భగీరథ పనులు చేపట్టేందుకు రూ.483 కోట్లు కేటాయించారు. డిసెంబర్‌ ఆఖరుకు ఒక్కో గ్రిడ్‌ పరిధిలో కొన్ని గ్రామాలకైనా తాగు నీటిని అందించాలనే లక్ష్యంలో ఉరుకులు పరుగులు తీసినా కుదరని పరిస్థితి నెలకొంది. వేసవి నాటికైనా పనులు వేగంగా చేసి కొన్ని గ్రామాలకు తాగునీరివ్వాలని ప్రయత్నిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలించడంలేదు.  ప్రతి గ్రామంలో అంతర్గత పైపులైన్లు, నూతన ట్యాంకులు నిర్మించడంతోపాటు ప్రతి బజారుకు అవసరమైన స్థాయిలో పైపులైన్‌ నిర్మించాల్సి ఉంది. ఈ తరహాలో ఇంట్రావిలేజెస్‌ పనులకు అవసరమైన ప్రతిపాదనలను క్షుణ్ణంగా ప్రతిపాదించారు. గ్రిడ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు సమన్వయంతో వీటిని రూపొందించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు ఇంకా ఎక్కువ సమయం కావాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.