రొహింగ్యాలపై సైన్యం మారణకాండ

– అమ్నెస్టీ ఇంటర్‌నేషనల్‌ వెల్లడి

ఢాకా,సెప్టెంబర్‌ 15,(జనంసాక్షి):రోహింగ్యాలపై ఒక క్రమపద్దతిలో మయన్యార్‌ సైన్యం హింసిస్తోందని అమ్నెస్టీ సంస్థ ప్రకటించింది. అమ్నెస్టీ ప్రకటనతో మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమ్నెస్టీ నివేదికపై ఐక్యరాజ్యసమితి కార్యదర్శి రెక్స్‌ టెలిర్సన్‌ మాట్లాడుతూ రోహింగ్యాలపై దాడులు చేయడాన్ని, వారు నివసిస్తున్న గ్రామాలపై సైన్యం దాడి చేస్తూ వారిని ఒక క్రమపద్ధతిలో హింసించడాన్ని ఎవరూ సమర్ధించరని అన్నారు. మయన్మార్‌లో బౌద్ధులు-రోహింగ్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. 3 లక్షల 91 వేలమంది వలస వెళ్లినట్లు ఆయన ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ఒక జాతికి చెందిన వ్యక్తులు వలస వెళ్లడం ఇదే తొలిసారి కావచ్చని రెక్స్‌ టెలిర్సన్‌ చెప్పారు. మయన్మార్‌లో గ్రామాలకు గ్రామాలను వదలి రోహింగ్యాలు ప్రాణరక్షణ కోసం వెళుతున్నారని చెప్పారు. ప్రస్తుత దారుణ పరిస్థితులను చక్కదిద్దేందుకు సహకరించాలని ఆంగ్‌సాన్‌ సూకీని కోరినట్లు రెక్స్‌ తెలిపారు.