రోడ్డు ప్రమాదంలో..  తమిళనాడు ఎంపీ దుర్మరణం


చెన్నై, ఫిబ్రవరి23(జ‌నంసాక్షి) : రోడ్డు ప్రమాదంలో పార్లమెంటు సభ్యుడు దుర్మరణం చెందిన ఘటన తమిళనాడులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. విల్లుపురం ఎంపీ, అన్నాడీఎంకే నేత రాజేంద్రన్‌ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదయం విల్లుపురం జిల్లా తిండివనమ్‌ వద్ద ఆయన కారును డ్రైవర్‌ రోడ్డువిూద ఉన్న స్టాప్‌ బోర్డును తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పింది. దీంతో డివైడర్‌ను బలంగా ఢీకొట్టి, వాహనం పల్టీలు కొట్టి ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. పీఎంకే అధ్యక్షుడు రాందాస్‌ ఆహ్వానం మేరకు ఏంపీ రాజేంద్రన్‌ జక్కంపెట్టయ్‌లోని ఆయన నివాసానికి శుక్రవారం రాత్రి వెళ్లారు. తన సహచరులు, పార్టీ ప్రతినిధులను కలిసిన అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ముందు సీట్లో కూర్చున్న ఎంపీ రాజేంద్రన్‌ తీవ్రంగా గాయపడి, ఘటనా స్థలిలోనే మృతిచెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు రాజేంద్రన్‌ అసిస్టెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ప్రమాదం సమయానికి కారులో నలుగురు ప్రయాణిస్తున్నారని అన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సవిూపంలోని హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు. అయితే, అప్పటికే రాజేంద్రన్‌ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో విల్లుపురం నియోజకవర్గం నుంచి ఏఐడీఎంకే తరపున రాజేంద్రన్‌ పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత లోక్‌సభలో ఎరువులు, రసాయనాలపై స్టాండింగ్‌ కమిటీ, పౌర విమానయాన సలహా సంఘంలోనూ సభ్యుడిగా కొనసాగారు. రాజేంద్రన్‌ హఠాన్మరణంపై ఏఐడీఎంకే పెద్దలు తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు.