రోడ్డు విస్తరణలో విద్యుత్‌ స్తంభాల తొలగింపు

విద్యుత్‌ శాఖ చెల్లింపులకు గుట్టుగా ఎసరు?
ఆదిలాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న స్తంభాల తొలగింపు, టవర్ల బిగింపు పనులు ఎలాంటి ఒప్పందం లేకుండానే ఇరుశాఖల అధికారుల మధ్య రహస్య ఒప్పందంతో అక్రమ పద్ధతిలో జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తద్వారా లక్షల రూపాయలు ఇరుశాఖల అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఆదిలాబాద్‌లో జరుగుతున్న పనులకు సంబంధించి అసలు ఎంత మొత్తం, ఎలా జరుగుతున్నాయనే వివరాలు అధికారుల వద్ద చెప్పేందుకు లేవు. జిల్లాలోని ఇచ్చోడ, బోథ్‌, ఆదిలాబాద్‌ శివారు ఖానాపూర్‌లోనూ ఇలాంటి పనులే జరగగా, అవికూడా ఒప్పందం లేకుండానే జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీఎండీ దృష్టి సారించి అధికారుల అవినీతిని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలో రిమ్స్‌ ఆస్పత్రి నుంచి తిర్పెల్లి వరకు నాలుగు వరుసలుగా ఉన్న పాత ఎన్‌హెచ్‌ రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా హెచ్‌టీ కరెంటు స్తంభాలను తొలగించి టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల స్తంభాలనే ఉంచి మిగతా చోట్ల టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. రహదారి
నిర్మాణంలో భాగంగా వివిధ పనులు కలిపి మొత్తం రూ.44.03 కోట్లతో ఆర్‌అండ్‌బీశాఖ ఈ పనులు చేపడుతోంది.  అయితే విద్యుత్‌ స్తంభాల తొలగింపు, టవర్ల ఏర్పాటు వంటి పనులకు పైన పేర్కొన్న నిధుల్లోంచే రూ.3 కోట్లతో ప్రత్యేకంగా పనులు చేపడుతున్నారు. ఇక్కడే అవినీతికి తెరలేచింది. ఆర్‌అండ్‌బీశాఖ పనులు చేపడుతుండగా విద్యుత్‌శాఖకు 10శాతం నిధులను నిర్మాణ ఖర్చుల కింద చెల్లించి చేపట్టాలి. ఇక్కడ ఇరుశాఖల అధికారులు ఒక ఒప్పందం చేసుకొని విద్యుత్‌శాఖ ఆదాయానికి గండిపెట్టి తమ జేబులు నింపుకునేలా అనధికారికంగా పనులు చేపడుతున్నారు. పైగా విద్యుత్‌శాఖ డీఈ ఈ పనులకు సంబంధించి ఆర్‌అండ్‌బీ నుంచి ఎంబీ రికార్డు చేసి కార్పొరేట్‌ ఆఫీసుకు నిధులు నేరుగా పంపిస్తారని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా పది శాతం నిధులు, విద్యుత్‌ అంతరాయానికి సంబంధించిన మొత్తం కలిపి విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ద్వారా ఒప్పందం చేసుకొని చెల్లింపులు జరిపిన తర్వాతే ఈ పనులు చేపట్టాల్సి ఉంటుందని ఆ శాఖాధికారులే చెబుతున్నారు. అదేవిధంగా పనులు జరిగే సమయంలో కరెంటు అంతరాయానికి సంబంధించి ఎంతైతే విద్యుత్‌శాఖకు నష్టం చేకూరుతుందో అంత పనులు చేపట్టే వారినుంచి వసూలు చేయాలి. దీనికి సంబంధించి ముందుగా ఆర్‌అండ్‌బీ నుంచి విద్యుత్‌శాఖకు దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించి అంచనా వ్యయం రూపొందించి ఆ వ్యయాన్ని డిమాండ్‌ నోటీసు ద్వారా పంపిస్తారు. దానికి బదులుగా ఆర్‌అండ్‌బీ శాఖ ఈ మొత్తాన్ని చెల్లించి ఒక ఒప్పందం చేసుకొని అప్పుడు పనులు చేపట్టాలి.