రోహిణి ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు

వరంగల్: హన్మకొండ రోహిణి ఆస్పత్రిలో నిన్న జరిగిన ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఘటన స్థలిలో క్లూస్ టీమ్ నమూనాలను సేకరిస్తోంది. మరోవైపు ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. కమిటీ మంగళవారం ఉదయం నుంచి విచారణ చేపట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ సరఫరా చేసే పైపు బ్రేక్ కావడం, స్విచ్ బోర్డు షార్ట్ సర్య్కూట్ కావడంతో పొగ, మంటలు వ్యాపించాయి.
సుబేదారిలోని రోహిణి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు శబ్దం విన్పించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు అనంతరం దట్టమైన పొగలు వ్యాపించాయని పేర్కొన్నారు. పొగలు కమ్ముకోవడంతో రోగులు, వారి బంధువుల హాహాకారాలు మిన్నంటాయి.. దీంతో రోడ్డున వెళ్లే వాహనదారులు లోపలికి చొచ్చుకొచ్చారు. ఈ కారణంగా రోడ్డుపై ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే నిమిషాల్లో అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకొని పొగలు వ్యాపించిన రెండో అంతస్థులోకి నీటిని చిమ్మాయి. రెండో అంతస్థులోనే ఉన్న ఐసీయూ వార్డులో చికిత్సపొందుతున్న సుమారు 20 మంది రోగులను ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు మంచాలతో సహా కిందికి తీసుకొచ్చారు. అంతలోనే అక్కడికి చేరుకున్న నగర పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది రోగులను బయటకి తీసుకురావడానికి శ్రమించారు. సంఘటన గురించి తెలుసుకున్న కలెక్టర్‌ అమ్రపాలి ఆదేశాల మేరకు నగరంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని రోగులను ఆస్పత్రులకు తరలించాయి. హన్మకొండ, వరంగల్‌ ప్రధాన రహదారిలో రోగులను తరలిస్తున్న అంబులెన్స్‌ల శబ్దాలు విన్న ప్రజలు ఏం జరిగిందో తెలియక కలవరపడ్డారు. సంఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 200 మంది రోగులు ఉన్నట్లు సమాచారం.