లక్నో వేదికగా అక్టోబర్‌లో ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌

కవిత దత్తత గ్రామ విద్యార్థులకు ఫెస్ట్‌కు ఆహ్వానం

ప్రదర్శన ఇవ్వనున్న విద్యార్థులు

జగిత్యాల,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో విశేష పురస్కరాలు, ఆహ్వానాలు అందుకుంటోంది. తెలంగాణ ప్లలె బిడ్డలకు జాతీయ స్థాయి ఆహ్వానాలు లభిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక పరంగా ఎన్నో గొప్ప అంశాలు కలిగిన ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌కు ఎంపీ కవిత దత్తత గ్రామమైన జగిత్యాల జిల్లా అంతర్గాం పాఠశాల విద్యార్థులకు ఆహ్వానం లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా అక్టోబర్‌ 4 నుంచి 8 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 15 వేల మందికి పైగా ప్రతినిధులు, తలపండిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఎందరో గొప్పగొప్ప మేధావులు పాల్గొననున్నారు. ఈ సదస్సుకుఅంతర్గాం విద్యార్థులకు ఆహ్వానం లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.జగిత్యాల జిల్లాలోని అంతర్గాం గ్రామాన్ని నిజామాబాద్‌ ఎంపీ కవిత దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఓ పక్క గ్రామం అభివృద్దిలో పరుగులు పెడుతుంటే.. గ్రామంలోని పాఠశాల విద్యార్థులు తమతమ ట్యాలెంట్‌ తో మెరుస్తున్నారు. ఈ ఏడాది ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్‌ ఐటీకి ఎంపిక కాగా, మరో విద్యార్థి అండర్‌-14 ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఇంతలోనే పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులకు అంతర్జాతీయ సైన్స్‌ ఫెస్ట్‌ కు రావాలని ఆహ్వనం అందింది. దీంతో పాఠశాల హెడ్‌ మాస్టర్‌, టీచర్స్‌, అంతర్గాం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వర్తమాన పరిస్థితులు, ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న మార్పులు ప్రధానాంశంగా అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్‌ సైన్స్‌ ఫెస్ట్‌ జరిగుతుంది. ఈ సదస్సులో మెగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎక్స్‌ పో, యంగ్‌ సైంటిస్ట్‌ కాన్ఫరెన్స్‌, ఉమెన్‌ సైంటిస్ట్‌ కార్పొరేషన్‌ ప్రదర్శించనున్నారు. ఈ ఫెస్ట్‌ కు అన్ని రాష్టాల్ర విద్యార్థులతో పాటు, వివిధ దేశాల నుంచి ఎంపికైన విద్యార్థులు కూడా పాల్గొననున్నారు. అందులో భాగంగా అంతర్గాం పాఠశాల నుండి 9, 10వ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్దులతో పాటు సైన్స్‌ టీచర్‌ పాల్గొనేందుకు అవకాశం దక్కింది.

ఎంపికైన విద్యార్థులు అక్టోబర్‌ 4 నాటికి లక్నో చేరుకోవాలి. వీరి ప్రయాణ ఖర్చులతో పాటు వసతి సదుపాయాలను భారత శాస్త్ర సాంకేతికశాఖ భరిస్తుంది. రాష్ట్రపతి లేదా ప్రధాని చేతుల విూదుగా ప్రారంభమయ్యే ఈ సదస్సులో అంతర్గాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శన ఇవ్వబోతున్నారు. దీంతో జగిత్యాల జిల్లా ఖ్యాతి అంతర్జాతీయ స్దాయిలో ఉండబోతోందని తమ విద్యార్దులు ఎంపిక కావటం ఊహించని పరిణామమంటున్నారు పాఠశాల ఉపాధ్యాయులు. ఇందుకు కృషి చేసిన ఎంపీ కవితకు విద్యార్దులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ జాతీయి స్థాయి సదస్సుతో జగిత్యాల జిల్లా పేరు అంతర్జాతీయ స్థాయిలో నిలువబోతోంది. దీంతో జిల్లా వాసులే కాకుండా అంతర్గాం గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.