లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో పాటు దేశీయంగా బ్యాంకింగ్‌, లోహ, ఔషధ రంగ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లను లాభాల వెంట పరుగులు తీయించాయి. దీంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 300 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 11,450 మార్క్‌ను దాటి సరికొత్త రికార్డును నమోదుచేసింది. కొనుగోళ్ల అండతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు లాభాలతో ప్రారంభించాయి. 190 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌.. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. రోజంతా లాభాల జోరులో సాగిన సూచీ చివరకు 284 పాయింట్లు లాభపడి 37,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 86 పాయింట్లు లాభపడి 11,471 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈలో గ్రాసిమ్‌, యస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, లుపిన్‌, టాటామోటార్స్‌ షేర్లు లాభపడగా.. గెయిల్‌, ఐషర్‌ మోటార్స్‌, హీరోమోటార్స్‌, ఓఎన్జీసీ, ఎయిర్‌టెల్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
——————————