లోక్‌సభ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ సన్నద్దత

16సీట్లు గెలుపే లక్ష్యంగా కార్యాచరణ
6నుంచి సన్నాహాక సమావేశాలు
కెటిఆర్‌ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు
హైదరాబాద్‌,మార్చి4(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధమవుతోంది. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు పార్టీ శ్రేణులను అందరినీ ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. 16 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ అందుకు అనుగుణంగా కార్యక్రమాలు మొదలు పెడుతోంది. ఇవన్నీ కూడా కెటిఆర్‌ పర్యవేక్షణలోనే జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం లక్ష్యంగా మార్చి 6 నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ సమావేశాలు జరగనున్నాయి. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం 2 వేల మంది చొప్పున ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇలా లోక్‌సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి సగటున 14 వేల మందితో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.  లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌
వ్యూహాన్ని వివరించి గెలుపు కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసేలా కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. ఐదేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ.. కేంద్రంలో కీలకపాత్ర పోషించేందుకు 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచి తీరాల్సిందేనని చెప్పనున్నారు. సన్నాహక సమావేశాలకు ముందు గానీ, తర్వాత గానీ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీలతో సమావేశం అవుతారు.కార్యక్రమంలో భాగంగా కేటీఆర్‌ ఖమ్మం, రామగుండంలో రాత్రి బస చేస్తారు. అక్కడి రాజకీయ పరిస్థితులపై తాజా గా నిర్వహించిన సర్వేల ఆధారంగా పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 16 లోక్‌సభ స్థానాలను  గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ సన్నా హక సమావేశం వనపర్తిలో, పెద్దపల్లి లోక్‌సభ సమావేశం రామగుండంలో, జహీరాబాద్‌ లోక్‌సభ సమా వేశం నిజాంసాగర్‌ ప్రాజెక్టు సవిూపంలో నిర్వహించనున్నారు. మిగిలిన 13 సెగ్మెంట్ల సన్నాహక సమావేశాలు ఆయా నియోజవర్గ కేంద్రాల్లోనే జరగనున్నాయి. మొత్తంగా కెటిఆర్‌ ఆధ్వర్యంలోనే పార్టీ ముందుకు సాగుతుందని సష్టత ఇచ్చినట్లు అయ్యింది.