వక్ఫ్‌ భూములు అమ్ముకున్న దొంగ చంద్రబాబు

మండిపడ్డ డిప్యూటి సిఎం మహ్మూద్‌ అలీ

ఖమ్మం,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఉమ్మడి ఎపిలో వక్ఫ్‌ భూములను సర్వనాశనం చేసిందే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ముస్లింలను ఆర్థికంగా అణగదొక్కింది ఆంధ్రా పార్టీలే అని ఆయన ధ్వజమెత్తారు. వక్ఫ్‌ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్న ఆంధ్రా నాయకులు పట్టించుకోలేదన్నారు. 5 వేల ఎకరాల వక్ఫ్‌ భూములను అమ్ముకున్న దొంగ చంద్రబాబు అని డిప్యూటీ సీఎం విరుచుకుపడ్డారు. ముస్లింను రెవెన్యూ మంత్రిగా చేయడం వల్లనే 45 వేల ఎకరాల వక్ఫ్‌ భూములను మళ్లీ రికార్డుల్లో పొందుపరిచగలిగామని తెలిపారు. చంద్రబాబు ఒక్క మైనార్టీ నేతకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని మహముద్‌ అలీ గుర్తు చేశారు.

తెరాస ప్రభుత్వంతోనే ప్రజలకు సంక్షేమ పథకాల అమలవుతాయని పేర్కొన్నారు. ఇక్కడ నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో ఆదర్శవంతమైన పాలన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించారని, ఎక్కడా అమలు చేయని రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టి రైతులకు మేలు చేశారన్నారు. అలాగే పేద యువతులకు షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు అందించారన్నారు. సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగాలంటే తెరాసకు ఓటెయ్యాలన్నారు. అలాగే గెలిచిన వెంటనే రూ.లక్ష రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు చేయనున్నారన్నారు.