వచ్చే ఆరు నెలల్లో.. సాగుకు గోదావరి జలాలు


– బతుకమ్మ చీరలను అడ్డుకున్న కాంగ్రెస్‌కు ఓటుతో బుద్దిచెప్పాలి
– టీడీపీ, కాంగ్రెస్‌ కుట్రలను తరిమికొట్టండి
– ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు
సిద్ధిపేట, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : వచ్చే ఆరు నెలల్లో సాగుకు గోదావరి జలాలు అందుతాయని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలోని జగదేవపూర్‌ మండలంలో మంత్రి హరీశ్‌రావు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత కొండపోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. జగదేవ్‌ పూర్‌ మండలంలోని కొండ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జంగంరెడ్డిపల్లి, ఛాటపల్లి, తీగుల్‌నర్సాపూర్‌లో మంత్రి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఆరునెలల్లో సాగుకు గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. బతుకమ్మ చీరలు అడ్డుకున్న కాంగ్రెస్‌కు మహిళలు ఓటుతో బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగాలంటే సీఎం కేసీఆర్‌తోనే
సాధ్యమని వివరించారు. రాష్ట్రంలో నాలుగేళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేసీఆర్‌ కృషి చేశారన్నారు. ముఖ్యంగా గత పాలకుల హయాంలో వ్యవసాయం అంటే దండగ అనే భావన ఉండేదని, కానీ నాలుగేళ్ల కాలంలో వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. రైతు లను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే రైతులకు పంటల సాగు సమయంలో పెట్టుబడుల కోసం వడ్డీవ్యాపారులను, బ్యాంకుల చుట్టూ తిరగకుండా పెట్టుబడి కింద ఎకరానికి రూ.4వేల చొప్పున రబీ, ఖరీఫ్‌లకు రూ.8వేలు అందించారన్నారు. అదేవిధంగా పంటలకు గిట్టుబాటు కల్పించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదన్నారు. రైతుల కుటుంబాల్లో పెద్దదిక్కు కోల్పోయినప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా రైతుబీమాను అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతి ఎకరాకు నీరందించేందుకు ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించటం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేని కాంగ్రెస్‌ నేతలు ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కోర్టులకెళ్లారని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులను నిర్మించితీరుతున్నామని అన్నారు. పోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్రా చేతుల్లో పెట్టేందుకు కాంగ్రెస్‌ నేతలు కుట్రలు చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ పొత్తుతో మళ్లీ చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, మళ్లీ తెలంగాణను అస్థిరపరిచేలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కూటములను తిప్పికొట్టాలని, మళ్లీ కేసీఆర్‌ను గెలిపించడం ద్వారా తెలంగాణను దేశానికే ఆదర్శంగా అందరం భాగస్వాములు అవుదామని హరీష్‌రావు పిలుపునిచ్చారు. ర్యాలీలో ఆయా గ్రామాల ప్రజలు మంత్రికి ఘనస్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మలతో భారీగా తరలివచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటేస్తామని గ్రామస్తులంతా ఈ సందర్భంగా తెలియజేశారు.