వణికిస్తున్న చలి

– తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
– బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలు
– మధ్యాహ్నం వేళల్లోనూ చల్లటి గాలులు
– మరో రెండు రోజులు చలి తీవ్రత ఉంటుంది
– స్పష్టం చేస్తున్న వాతావరణ అధికారులు
హైదరాబాద్‌, జనవరి3(జ‌నంసాక్షి) : తెలుగు రాష్ట్రాల ప్రజలను చలిపులి వణికిస్తోంది.. గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 5గంటల నుంచి చలి విరుకుపడుతుండటంతో పాటు ఉదయం 10గంటల వరకు ఇదే రీతిలో చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో ఉత్తరకోస్తా, రాయలసీమల్లో చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎనిమిది డిగ్రీల వరకు తక్కువగా నమోదు అవుతున్నాయి. ఉదయం పది గంటలలోపు, సాయంత్రం ఆరు గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్వెటర్స్‌, మాస్క్‌లు ధరించి పనులకు వెళ్తున్నారు. ఉత్తర భారత నుంచి వీస్తున్న శీతల గాలుల ఉధృతితో తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. మరో రెండు రోజులు వీటి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్‌, మెదక్‌, రామగుండం, హన్మకొండ, హైదరాబాద్‌లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటున్నా, రాత్రి సమయంలో మంచుతో వాతావరణం బాగా చల్లబడుతోంది. మరోవైపు అతి శీతల గాలులు హైదరాబాద్‌ వాసులను వణికిస్తున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వీస్తున్న చలిగాలులతో వాతావరణం పొడిగా మారింది. ఇక రాత్రివేళ ఉష్ణోగ్రతలు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. చలి తీవ్రత మరో రెండురోజులు ఇలాగే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు మధ్యాహ్నం సమయంలోనూ చల్లటి ఈదురు గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉత్తర, ఈశాన్య భారతంలో దారుణ స్థితి..
మరోవైపు సాధారణగా చలిఎక్కువగా ఉండే ఉత్తర, ఈశాన్య భారతంలో ఈదఫా పరిస్థితి దారుణంగా ఉంది. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, బీహార్‌, వారణాసిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో నీరు గడ్డకడుతోంది. ఢిల్లీ, అమృత్‌సర్‌లో మంచుదుప్పటి కమ్మేసింది. దీంతో రవాణావ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కొండలు, లోయల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఏజెన్సీ ప్రాంత వాసులు అల్లాడుతున్నారు. కీలాల్‌, కల్ప, మనాలి, కార్గిల్‌, లడక్‌లో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు చేరాయి.
చలి తీవ్రత తాళలేక ఇద్దరు మృతి..
తెలంగాణలో చలి మరింత విజృంభిస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలులకు రాష్ట్రం గడ్డకట్టుకుపోతోంది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలికి తట్టుకోలేక
వికారాబాద్‌ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కొడంగల్‌కు చెందిన రాములు, వికారాబాద్‌కు చెందిన జంగయ్య (54) చలి తీవ్రతకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్‌, మెదక్‌లలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, రామగుండంలో 9, హైదరాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులు కూడా చలి తీవ్రత ఉంటుందని పేర్కొంది.