వన్యప్రాణుల శ్రేయస్సే మా ధ్యేయం

:నేనుసైతం’ ప్రధాన కార్యదర్శి సలీమ వెల్లడి.
– కొనసాగుతున్న సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమం.
– ఇప్పటి వరకు 95 వేల బాల్స్ చల్లిన కుటుంబం.
మహబూబాబాద్, జనం సాక్షి(అక్టోబర్ 15)
:వన్యప్రాణుల ఆకలి బాధను శాస్వతంగా దూరం చేయాలనే ధ్యేయంతోనే అటవీ ప్రాంతంలోని గుట్టలలో సీడ్ బాల్స్ [విత్తన బంతులు] విసిరే కార్యక్రమాన్ని చేపట్టామని ‘నేనుసైతం’ స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి మహ్మద్ సలీమ వెల్లడించారు. సలీమ కుటుంబ సభ్యులు నెల రోజులపాటు శ్రమించి తయారు చేసిన లక్ష నేరేడు విత్తన బంతులను అటవీ ప్రాంతంలో విసిరే కార్యక్రమం నిర్వీరామంగా కొనసాగుతుంది. అందులో భాగంగానే శనివారం జమాండ్లపల్లి శివారులోగల అటవీ ప్రాంతంలో సలీమ కుటుంబ సభ్యులు సీడ్ బాల్స్ ను వెదజల్లారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ మానవుని అత్యాస కారణంగా అడవులు అంతరించిపోతుండడంతో తినడానికి తిండి దొరకక వన్యప్రాణులు పట్టణాలపై పడుతున్నాయన్నారు. అడవులను పునరుద్ధీకరించడంతో పాటు మూగ జీవాలకు శాస్వతంగా ఆహారాన్ని అందించేందుకు ఈ సీడ్ బాల్స్ విసిరే ప్రక్రియ ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంటుందన్నారు. యువకులు పెద్దెత్తున మొక్కలు నాటడమే కాకుండా అక్రమంగా తరలిపోతున్న కలప వాహనాలను అడ్డుకొని సంభందిత అధికారులకు అప్పగించాలని కోరారు. ఇప్పటి వరకు 95 వేల సీడ్ బాల్స్ విసిరివేత పూర్తయ్యిందని, మిగిలిన 5 వేల బాల్స్ ను సోమవారం విసిరి కార్యక్రమాన్ని ముగించనున్నట్లు సలీమ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అద్యక్షుడు మహ్మద్ సుభాని, సమీర్, సుమ పాల్గొన్నారు.