వరదల నుంచి కోలుకుంటున్న కేరళ

వ్యాధుల నివరాణకు ప్రత్యేక శ్రద్ద

సత్ఫలితాలు ఇస్తున్న ప్రభుత్వం చర్యలు

తిరువనంతపురం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఇటీవల వరద బీభత్సానికి గురైన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రజలు కాళరాత్రిని మరచిపోయి తమ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఇల్ల పునరుద్దరణ, బురద ఎత్తివేత, పనుల్లో నిమగ్నం అయ్యారు. ప్రధానంగా అంటువ్యాధులు వారిని పట్టిపీడిస్తున్నాయి.

కేరళలో సహాయ కార్యక్రమాలను సవిూక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా వ్యాధుల కట్టడిలోనూ, బాధితులకు పునరావాసం కల్పించటంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రశింసించారు. వరద బీభత్సం నేపథ్యంలో భారీయెత్తున చేపట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్న వ్యాధి నివారణ చర్యలు బహుశ ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైనవని ఆయన అన్నారు. కాగా వ్యాధుల నివారణకు అశాస్త్రీయ పద్దతులు చేపడుతుండటంపై ఆరోగ్య మంత్రి ప్రజలను పదేపదే హెచ్చరిస్తూ వస్తున్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నాచురోపతి ప్రాక్టీషనర జాకబ్‌ వడక్కన్‌చెర్రిపై ఇటీవల ఫిర్యాదు అందటంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు వ్యాధులు ప్రబలే ప్రమాదాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కట్టడి చేసేందుకు ‘శ్రద్ధ’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వరద బీభత్సానికి తీవ్రంగా దెబ్బతిన్న ఎర్నాకుళం జిల్లాలో ఆరోగ్య శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాలను, అక్కడి ఇళ్లను సందర్శించి వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు. వ్యాధుల నివారణ, కట్టడికి ఇతర శాఖల సమన్వయంతో పనిచేయటం లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వరద తాకిడికి గురైన జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశాఖ కార్యకర్తలు ప్రతిఇంటిని సందర్శించి ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి,వాటి వ్యాప్తిని నివారించేందుకు చర్యలు చేపట్టటం, నీటి కాలుష్యాన్ని అరికట్టటం, ప్రజలలో చైతన్యం కలిగించటం వంటి చర్యలు చేపట్టారు. శ్రద్ధ కార్యక్రమం కింద వివిధ సంస్థలకు చెందిన 280 మంది జూనియర్‌ హెల్త్‌ ఇన్స్‌పెక్టర్లు, 426 మంది పబ్లిక్‌ హెల్త్‌ నర్స్‌లు, 1,995 మంది ఆశావర్కర్లు సేవలందిస్తున్నారు. వీరితో పాటు ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన 85 మంది జూనియర్‌ ఇన్స్‌పెక్టర్లు ఈ పథకం అమలులో కీలక పాత్ర

పోషిస్తున్నారు. ఆరోగ్య శాఖ కార్యకర్తల చొరవతో ఈ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. లెప్టోస్పిరోసిస్‌, డయేరియా, డెంగ్యూ, వంటి నీటి సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించిన ఆరోగ్య కార్యకర్తలు జలవనరులను కాలుష్యరహితంగా మార్చటంపై దృష్టి సారించారు. వరదల్లో దాదాపు 43 లెప్టోస్పిరోసిస్‌ అనుమానిత కేసులను గుర్తించామని, ఇందులో 13 మంది మరణించారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ చెప్పారు. నీటి సంబంధిత వ్యాధుల వ్యాప్తిపై వరద ప్రభావిత జిల్లాలన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వం ముందసుత హెచ్చరికలు జారీ చేసిందని ఆమె వివరించారు.