వరద పరిస్థితులను సవిూక్షించిన ఈటెల

భారీ వర్షాలతో సాగు, తాగునీటికి ఢోకాలేదని వెల్లడి

కరీంనగర్‌,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్‌ జిల్లా అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉందని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. రెండు, మూడు రోజులుగా ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి వరదలపై సవిూక్షించారు. తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలో వరద ప్రభావంపై కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, అధికారులతో ఈటెల సవిూక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్నందున రెండేళ్ల వరకు తాగు, సాగు నీటికి కొరత ఉండదని రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రాజెక్టులు నిండుకుండలా మారబోతున్నాయి. కాళేశ్వరం ప్రతిఫలాలు ముందుగా కరీంనగర్‌ జిల్లాకే అందుతాయని చెప్పారు. ప్రస్తుత వర్షాలతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వివరించారు. మేడిగడ్డ వద్ద దాదాపు 100 టీఎంసీల నీరు వృథా అయిందని తెలిపారు. సీడ్‌బౌల్‌ ఆఫ్‌ తెలంగాణగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నిలిచిందని పేర్కొన్నారు.