వరద బాధితుల్ని ఆదుకుంటాం

– నగరంలో మంత్రి కేటీఆర్‌ విస్తృత పర్యటన

– అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని భరోసా

– పలు ప్రాంతాల్లో బాధితులకు చెక్కుల పంపిణీ

హైదరాబాద్‌,అక్టోబరు 20(జనంసాక్షి): నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఖైరతాబాద్‌లోని ఎంఎస్‌ మక్త, రాజు నగర్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ముంపునకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు మంత్రి కేటీఆర్‌ రూ.10వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట నగర మేయర్‌ బొంతు రామ్మెహన్‌, స్థానిక అధికారులు ఉన్నారు. నగరంలో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక సహాయం ప్రకటించారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అవిూర్‌పేట డివిజన్‌లోని బస్తీనగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముంపు బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని వరద బాధితులను ఆదుకోవాలని తలసాని సూచించారు. సుమారు 100 మంది బాధితులకు చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌తోపాటు స్థానిక కార్పొరేటర్‌ శేషుకుమారి పాల్గొన్నారు. వరద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. నష్టపోయిన వారందరికీ రూ.10వేల ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఎవరికైనా సహాయం అందకపోతే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని అన్నారు. వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ వంతు సహాయం అందించనున్నారు. సీఎంఆర్‌ఎఫ్‌కు తమ రెండు నెలల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. సహాయ చర్యలకు ముందుకొచ్చిన గ్రేటర్‌ తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కేటీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం..

నగరంలో భారీ వర్షాలకు ప్రభావితమైన కాలనీల్లో సహాయ చర్యల పర్యవేక్షణకు కోసం మంత్రి కే. తారకరామారావు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి వారికి పలు సూచనలు చేశారు. రానున్న పది రోజుల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సహాయం అందేలా చూడాలని కోరారు. నగరంలో వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ తక్షణ సాయం అందాలన్న ముఖ్యమంత్రి ఆలోచన మేరకు పనిచేయాలని సూచించారు. తక్షణ సహాయం అందిస్తూనే మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. జిహెచ్‌ఎంసి ఏర్పాటుచేసిన షెల్టర్‌ క్యాంపులను పరిశీలించి అక్కడ అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించాలని, అక్కడ అవసరం అయిన టాయిలెట్స్‌, దుప్పట్లు, మందులు, భోజనాలు అందేలా చూడాలన్నారు.ప్రస్తుతం ముంపుకు గురై కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలని, ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో రిస్టోరేషన్‌ పనులను పర్యవేక్షించాలని తెలిపారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు మంత్రి కేటీఆర్‌. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.