వలసలను నివారించలేకపోతున్న ఉపాధి

పనుల కోసం పట్టణాకు కూలీల పయనం
మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): వలసల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు  ఉపాధి హావిూ పథకం భరోసా ఇస్తున్నా వలసలు మాత్రం తప్పడం లేదన్న విమర్శలు ఉన్నాయి.  కూలీలకు ఉపాధి కల్పించడానికి కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నామని అధికారులు, పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామం కూలీలకు ఆందోళనకు లోను చేస్తోంది. ఉపాధి హావిూ పథకంలో గతేడాది ఉమ్మడి జిల్లాలో సగటు పనిదినాలు వంద రోజులకుగాను 50 రోజూలు దాటలేదు. సగటు కూలీ వేతనాల్లో నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలు కొంత ఆశాజనకంగా ఉన్నా ఈ జిల్లాల్లోనూ ఆశించిన మేర కూలీలకు సగటు వేతనాలు అందడం లేదు. దీంతో కూలీ గిట్టుబాటుకావడం లేదని కూలీలు పనులపై ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంటోంది. మరోపక్క ఉపాధి పథకంలో లొసుగులు, నిబంధనలు కూలీల ఉపాధికి అడ్డుగా కనిపిస్తున్నాయి. దీంతో అనేకుల యధావిధిగానే పనుల కోసం వలసబాట పడుతున్నారు. వలసలను నివారించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకానికి బాలారిష్టాలు తప్పడం లేవు. ఉమ్మడి జిల్లాలో ఉపాధి హావిూ పథకం కింద పనులు చేసిన కూలీలకు ఇంతవరకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించలేదు. నిర్దేశిత కుటుంబాలకు వంద రోజుల పనిదినాలను కల్పించలేదు. దీంతో నిరుపేద కూలీలు నష్టపోతుండగా పనులూ ఆశాజనకంగా సాగడం లేవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనులు పూర్తయి నెలలు గడిచినా వేతనాలు ఇవ్వని పరిస్థితి నెలకొందిన కూలీలు వాపోతున్నారు. నాగర్‌కర్నూల్‌,
మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో ఉపాధి హావిూ పథకం కింద నిధులు విరివిగా ఉండి పనులు అధికంగా చేయించే అవకాశముంది. నిధులను వినియోగించడంలో, పనులను చేయించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఎక్కడా కనీసం 50 రోజులు కూడా దాటలేని పరిస్థితి కనిపిస్తోంది.వీటిని దృష్టిలో ఉంచుకోనైనా అధికారులు, పాలకులుకూలీలకు విస్తృంగా ఉపాధి హావిూ పథకం పనులు చేపట్టి కూలీల వలసలను అరికట్టాలని  కోరుతున్నారు.