వాతావరణంలో మార్పుల కారణంగానే వ్యాధులు

– మెరుగైన సేవలు అందిస్తున్నాం
– అన్నిచోట్లా మందులు అందుబాటులో ఉన్నాయి
– ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌
– పబ్లిసిటీ కోసం గాలిమాటలొద్దు
– హెల్త్‌ ఎమర్జెన్సీ వచ్చినట్లు ఎందుకంత రాద్ధాంతం
– ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డ మంత్రి తలసాని
– గాంధీ ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : వాతావరణంలో మార్పుల కారణంగానే సీజన్‌ వ్యాధులు ప్రబలుతున్నాయని, వ్యాధుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు
అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఈటెల రాజేందర్‌లు గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల గాంధీ ఆస్పత్రిలో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ఆస్పత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ… వాతావరణంలో మార్పుల కారణంగానే వ్యాధులు వస్తున్నాయని, రోగులకు సరైన సేవలు అందించేందుకు వైద్యులు, ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని చోట్లా మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను చూస్తే తెలంగాణలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అన్ని చోట్లా మందులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.గాంధీ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన సెమినార్‌ హాలు, లైబ్రరీని మంత్రులు ప్రారంభించారు.
పబ్లిసిటీకోసం గాలిమాటలొద్దు – మంత్రి తలసాని
వాస్తవాలు విస్మరించి.. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. నగరంలో వైద్యులంతా అప్రమత్తంగా ఉన్నారని, ఆదివారం కూడా వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు. వాతావరణం మార్పుతో సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. విషజర్వాలను అదుపు చేయడానికి వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే  బెస్ట్‌ మెడికల్‌ సేవలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేయొద్దని హితవు పలికారు. డెంగీ లేదనడం లేదని.. డెంగీని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పబ్లిసిటీ కోసం గాలి మాటలు మాట్లాడవద్దని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాయన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తలసాని స్పష్టం చేశారు.