వానాకాలం పంటల సాగుకు యాక్షన్‌ప్లాన్‌

వరితో పాటు ఆరుతడి పంటలకు ప్రోత్సాహం
విత్తనాలు, ఎరువులు సిద్దం చేస్తున్న అధికారులు
నిజామాబాద్‌,మే25(జ‌నంసాక్షి): జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాశాఖ 2022`23 ఆర్థిక
సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ యేడాది రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జిల్లా వ్యవసా యాధికారులు పంటల సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. వానాకాలంలో రైతులకు పంటలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంటల కాలనీ ఏర్పాటులో భాగంగా వరి సాగులో అత్యాధునిక పద్దతులను రైతులు అవలంభించేవిదంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరిలో విత్తనాలు వెదజల్లే పద్దతిని ప్రొత్సహించేందుకు సిద్దమవుతున్నారు. వానకాలం సీజన్‌లో సరిపడా విత్తనాలు, ఎరువులను సమకూరుస్తునే సీజన్‌ ప్రారంభానికి ముందే అన్ని క్లస్టర్‌ల పరిధిలో రైతులకు అత్యాధునిక పద్ధతులను వివరించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం ప్రణాళికను ఖరారు చేశామని జిల్లా ఇన్‌చార్జీ వ్య వసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ తెలిపారు. రైతుల సాగుకు ఇబ్బందు లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో వరిసాగు ఎక్కువగా ఉన్నందు వల్ల ఈ పంటను అత్యాధునిక పరిజ్ఞానంతో పండిరచే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఖర్చు తగ్గించి ఎక్కువ దిగుబడి వచ్చే పద్ధతులను రైతులకు వివరిస్తున్నామని తెలిపారు. జిల్లాలో వరితో పాటు ఆరుతడి పంటలను కూడా ఎక్కువమొత్తంలో సాగయ్యే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కొన్ని రకాల విత్తనాలు సరఫరా చేస్తున్నామని, ఇతర విత్తనాలను ప్రైవేట్‌ విత్తన సంస్థల ద్వారా కొనుగోలు చేసుకోవాలన్నారు. వానకాలం సీజన్‌లో ఏ పంటలు ఎక్కువగా పెరగనున్నాయో యాక్షన్‌ ప్లాన్‌లో పొందుపర్చారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రైతులకు ఆరుతడి పంటల సాగును వివరించడంతో పాటు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వానాకాలంలో 5లక్షల 9వేల 753 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తం పంటల్లో 79శాతం వరకు 4లక్షల వెయ్యి 591 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేశారు. పంటలకు అనుగుణంగా విత్తనాలను సమకూర్చాలని ప్రభుత్వానికి పంపిన ప్రణాళికల్లో పేర్కొన్నారు. జిల్లాలో పత్తి సాగును కొత్తగా మొదలుపెడుతున్నందు వల్ల మొత్తం 4600 ప్యాకెట్లు అవసరమని ప్రణాళికలో పొందుపర్చారు. వీటితో పాటు సబ్సీడిపై జీలుగ విత్తనాలను ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా సరఫరా చేయనున్నారు. వెదజల్లే పద్ధతికి ప్రోత్సాహం జిల్లాలో వచ్చే వానాకాలం సాగుకోసం వరిలో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గించడంతో పాటు దిగుబడి పెంచడంలో భాగంగా ఈ పద్ధతిని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వానాకాలంలో రైతులకు అవసరమైన రుణ ప్రణాళికను కూడా లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరులో రుణ ప్రణాళికను ప్రకటించనున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
“““““““““““
హనుమత్జయంతి ప్రాశస్త్యం (ఆధ్యాత్మిక చింతన )
కొండగట్టు,మే25(జ‌నంసాక్షి): శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరేపూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే.. అని చెప్పబడిరది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమినాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్‌ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పెద్దలు అంటుంటారు.ఎక్కడెక్కడ రామనామము వినబడుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని భక్తుల నమ్మకం. రామ భక్త పరాయణుడు, బహుపరాక్రమశాలి, ఘోటక బ్రహ్మచారి శ్రీ ఆంజనేయుడి జన్మదినాన్ని ‘హనుమాన్‌
జయంతిగా ఉత్సవాలు చేసుకొంటారు. భారతీయ హిందువులే కాకుండా నేపాల్‌ లాంటి విదేశాల్లో కూడా విరివిగా జరుపుకుంటారు. హనుమాన్‌ జయంతి ఏడాదికి రెండు సార్లు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మొదటి మాసమైన చైత్రమాసం పౌర్ణమి నాడుహనుమాన్‌ జయంతిని జరుపుకుంటారు. హనుమాన్‌ జయంతిని కొందరు చైత్ర మాసం పౌర్ణమి నాడు చేస్తుండగా మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుకోవటం గమనార్హం. కేరళ, తమిళనాడు రాష్టాల్లో మూల నక్షత్రంలో జరుపుకుంటే.. . మహారాష్ట్రలో చంద్రమాన పంచాంగం ప్రకారం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకొంటారు. ఇక తెలంగాణా, ఆంధప్రదేశ్‌ లో హనుమజ్జయంతి ని వైశాఖమాసం కృష్ణపక్ష దశమి నాడు జరుపుకుంటారు.కొందరు హనుమాన్‌ భక్తులు తెలంగాణా, ఆంధప్రదేశ్లలో 41 రోజుల దీక్షను చైత్రమాసం పౌర్ణమి నాడు ప్రారంభించి వైశాఖమాసం కృష్ణపక్షం 10రోజున ముగిస్తారు.
“““““““““““