వారసత్వ ఉద్యోగార్థుల్లో తొలగిని ఆందోళన

సింగరేణి యాజామాన్య ప్రకటన కోసం ఎదురుచూపు
ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై  పెట్టుకున్న ఆశ నిరాశే కావడంతో సిఎం కెసిఆర్‌ దీనిపై ఎలా స్పందిస్తారో అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. టిఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ఏదైనా ప్రకటన చేస్తారా అన్న ఆశ వారిలో ఉంది. సుప్రీం తీర్పుతో  ఉద్యోగం చేయించాలకున్న కార్మికులు, కొలువు చేయాలని అనుకున్న వారి పిల్లల కలలు చెదిరిపోయాయి.  వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. సింగరేణిలో 18 ఏళ్ల క్రితం వారసత్వ ఉద్యోగాలు రద్దు అయ్యాయి. అప్పటి నుంచి ఉద్యోగాల కోసం కార్మిక వర్గం ఎదురు చూస్తోంది. 2012లో సింగరేణి గుర్తింపు ఎన్నికల ముందు తెరాస అనుబంధ సంఘం తెబొగకాసంను గెలిపిస్తే వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. తెబొగకాసం గెలుపొందింది. 2016 అక్టోబరు 6న ముఖ్యమంత్రి ఉద్యోగాలపై ప్రకటన చేశారు. 2016 నవంబరు 4న సింగరేణి బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. యాజమాన్యం దరఖాస్తులను స్వీకరించేందుకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 2017 జనవరి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టారు. మార్చి 31న ముగించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ముందుకు వచ్చి తమ ఉద్యోగాలను వారి పిల్లలకు ఇచ్చేందుకు దరఖాస్తులు ఇచ్చారు. సింగరేణి వ్యాప్తంగా దాదాపుగా 12,150 దరఖాస్తులు  వచ్చాయి.  ఫిబ్రవరి 1న హైకోర్టులో గోదావరిఖనికి చెందిన నిరుద్యోగి సతీష్‌కుమార్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. వాదనాలు విన్న హైకోర్టు
మార్చి 16న తీర్పును వెలువరించింది. వారసత్వ ఉద్యోగాల ప్రకటనను రద్దు చేయాలని, నోటిఫికేషన్‌ ఇచ్చి
నూతన నియామకాలు చేపట్టాలని తీర్పులో పేర్కొంది. అనారోగ్య సమస్యలతో విధుల్లో కోనసాగేందుకు
అనర్హులని తేలినప్పుడు ఆ ఉద్యోగి వారసులకు ఉద్యోగం కల్పించాలే తప్ప ఏక మొత్తంగా వారసత్వ
ఉద్యోగాలు ఇస్తామనడం సరికాదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీం కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో కార్మికులు, వారి వారసుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఇకముందు కారుణ్య నియామకాలుగా ఉద్యోగాలు ఇస్తామని అన్నా అందుకు అనుగుణంగా పెద్దగా కార్యాచరణ సాగలేదు. గత వారం రోజలుగా ఇప్పుడు కార్మికుల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఎలాంటి ఆశాజనక ప్రకటన వస్తుందా అని చూస్తున్నారు. బహిరంగ సభలో అయినా సిఎం తమకు అనుకూల ప్రకటన చేస్తారని చూస్తున్నారు.