విండీస్‌ పర్యటనలో యువ ఆటగాళ్లకు పెద్దపీట

కీపర్‌గా వృద్ధిమాన్‌ సాహాకు చోటు
శుభ్‌మన్‌ గిల్‌కు చోటు దక్కక పోవడంపై అభిమానుల నిరాశ
ముంబయి,జూలై22(జ‌నంసాక్షి): వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే జట్టు ఎంపికలో సెలక్షన్‌ కమిటీ యువఆటగాళ్లకు పెద్దపీట వేసింది. ధోనీ అందుబాటులో లేకపోవడంతో రిషబ్‌ పంత్‌ను ప్రధాన వికెట్‌ కీపర్‌గా ప్రకటించారు. అయితే టెస్టులకు పంత్‌కు బ్యాక్‌ అప్‌ కీపర్‌గా వృద్ధిమాన్‌ సాహాకు చోటు కల్పించారు. కానీ, టెస్టులకు మరో వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ సిద్ధంగా ఉన్నాడని టీమిండియా సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపారు. టెస్టులకు పంత్‌, సాహాతో పాటుగా కేఎస్‌ భరత్‌ పేరు కూడా చర్చకు వచ్చిందని టీమిండియా సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నారు. ‘భారత్‌-ఎ జట్టులో ఆటగాళ్ల ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుని మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌, నవదీప్‌ సైనీని ఎంపిక చేశాం. కేఎస్‌ భరత్‌ ఎంపికకు చాలా దగ్గరగా వచ్చాడు. అయితే గాయపడిన సాహాకు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతనికి జట్టులో చోటు కల్పించాం. కానీ, భరత్‌ భారత్‌-ఎ తరఫున అద్భుతంగా రాణించాడు. గత మూడు సిరీస్‌ల్లోనూ అతను మూడు సెంచరీలు బాదాడు. అంతేకాకుండా వికెట్‌కీపర్‌గా 50 మందిని ఔటుచేశాడు. టెస్టుల్లో పంత్‌, భరత్‌, సాహాను కొంతకాలం పరీక్షిస్తామని తెలిపారు.   వైజాగ్‌కు చెందిన కోన శ్రీకర్‌ భరత్‌ కేఎస్‌ భరత్‌ భారత్‌-ఎ తరఫున ఆస్టేల్రియా-ఎ, ఇంగ్లాండ్‌ లయన్స్‌, శ్రీలంక-ఎ జట్లపై శతకాలు చేశాడు. వికెట్ల వెనుక అతను చురుగ్గా వ్యవహరిస్తూ ఎన్నో మెరుపు స్టంపింగ్స్‌, అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నాడు. ఈ తెలుగు కుర్రాడు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీని కూడా బాదాడు. ఇకపోతే  వెస్టిండీస్‌ పర్యటనకు భారత యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేయకపోవడంతో అభిమానులు టీమిండియా సెలక్షన్‌ కమిటీని విమర్శిస్తున్నారు. వెస్టిండీస్‌ పర్యటనలో భారత్‌-ఏ జట్టులో అద్భుతంగా రాణిస్తున్న గిల్‌ను పక్కన పెట్టడంతో సామాజిక మాధ్యమాల్లో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు.కేదార్‌ జాదవ్‌ స్థానంలో గిల్‌ను ఎంపిక చేయాల్సింది. కేదార్‌ 2023 ప్రపంచకప్‌ వరకు ఆడగలడా? గిల్‌కు నాలుగో స్థానంలో ఆడటానికి అవకాశం ఇవ్వాలి. భవిష్యత్తులో అతడు జట్టుకు కీలక ఆటగాడిగా మారుతాడు. సెలక్షన్‌ కమిటీ ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తుందో అర్థం కావడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ,
రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇచ్చి యువకులను పరీక్షించాలని కోరుతున్నారు. పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌కు వన్డేల్లో అవకాశం ఇవ్వాలని కామెంట్లు పెడుతున్నారు. భారత్‌-ఏ తరఫున విండీస్‌తో ఆడిన మూడు మ్యాచుల్లో గిల్‌ 49.67 సగటుతో 149 పరుగులు చేశాడు. వీటిలో రెండు అర్ధశతకాలు ఉండటం విశేషం. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడిన అతను 296 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో టాప్‌ఆర్డర్‌లో బరిలోకి దిగినప్పుడు రెండు అర్ధశతకాలు బాది తన సత్తా చాటాడు. గతంలో భారత్‌ తరఫున ఆడిన రెండు వన్డేల్లో గిల్‌ అంతగా ఆకట్టుకోలేక పోయాడు.