విజయం

కార్యకర్తలకు అంకితం..

ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తా

గెలిచిన అభ్యర్థులతో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కమలం జెండా రెపరెపలాండిది. కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. ఈ విజయంతో తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది. నాయకులు, కార్యకర్తల్లో ఫుల్‌ జోష్‌ను నింపింది. బీజేపీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమే ఈ విజయానికి కారణమని వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎన్నికల కమిషనర్‌, డీజీపీలకు అంకితం చేస్తున్నానని అన్నారు. పోలీసులు, ఎంఐఎం కార్యకర్తలు ఎన్ని దాడులు చేసిన ప్రజలు బీజేపీ పక్షంగా ఉండి అభ్యర్థులను గెలిపించారని చెప్పారు. ఓటర్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. గెలిచిన బీజేపీ అభ్యర్థులతో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని పిలుపునిచ్చారు. ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యం సష్టంగా కనిపించిందని చెప్పారు. సీఎం వ్యవహారశైలికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని.. వారందరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తానని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా ఫుంజుకుంది. మొత్తం 150 డివిజన్లకు గానూ 49 స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్‌లో సత్తా చాటింది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగే సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం 49 సీట్లను కైవసం చేసుకుంది.ఈ నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు షురూ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంతత్రి కిషన్‌ రెడ్డితో పాటు డీకే అరుణ, లక్క్ష్మణ్‌లు కలిసి కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు. అనంతరం ఒకరినొకరు స్వీట్లు పంచుకొన్న బీజేపీ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా 2023లో తెలంగాణలో అధికారమే లక్క్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్‌ పేర్కొన్నారు.