విజయమవంతంగా పూర్తయిన రైతుబంధు

ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్న కలెక్టర్‌
భద్రాద్రి కొత్తగూడెం,మే19(జ‌నం సాక్షి):  రైతుబంధు పథకం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవరోధానలు లేకుండా సంపూర్ణంగా చేపట్టామని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా దమ్మపేట మండలంలో రూ.9.53 కోట్లు, అశ్వారావుపేట మండలంలో 9.36 కోట్లు, దుమ్ముగూడెం మండలంలో రూ.8.23 కోట్లు పంపిణీ జరిగాయి. ఈమూడు మండలాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలుగా చెక్కుల పంపిణీలు జరిగాయి. ఈ మండలాల్లో ఎక్కువ సంఖ్యలో రైతులు ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో సాగు సహాయం పెట్టుబడి రూపంలో అందింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం జిల్లాలో సుమారు రూ.82 కోట్లు రైతులకు చెక్కుల రూపంలో అందజేశారు. జిల్లాలో 70,160 మంది రైతులకు పాస్‌పుస్తకాలను, 71,225 చెక్కులను పంపిణీ చేసినట్లు శుక్రవారం రాత్రి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌, రైతుబంధు రాష్ట్ర పరిశీలకురాలు లక్ష్మీబాయి జిల్లాలో పర్యటించి ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి రోజు జిల్లాలో జరుగుతున్న రైతుబంధు పథకం పంపిణీని పర్యవేక్షించేందుకుగాను ప్రత్యేక టీమ్‌లు పరిశీలన జరిపాయి. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ మొత్తం 69 బృందాలు పరిశీలనలో పాల్గొన్నాయి. జిల్లా స్థాయిలో ఎప్పటికప్పుడు పథకాన్ని పరిశీలించేందుకు డీఏవో ఆధ్వర్యంలో మరో బృందం విస్తృతంగా పర్యటించింది.  ప్రతీ రోజూ రైతుబంధు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలు, ఐకేపీ తరుపున మొత్తం 500 మంది అధికారులు, సిబ్బంది సేవలు అందించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 354 గ్రామాల్లో నిర్ధేశించిన రైతులకు చెక్కులు, పాస్‌ పుస్తకాలను అందించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించగా ఈ నెల 21వరకు తహసీల్దార్‌ కార్యాలయాల్లో మిగిలిన చెక్కులు, పాస్‌పుస్తకాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు.
రైతులకు వ్యవసాయానికి పెట్టుబడికి అందజేసేందుకు జిల్లాకు మొదటి విడతగా రూ.125.22 కోట్లు మంజూరైనట్లు  పతకం ప్రారంభంలో కలెక్టర్‌ ప్రకటించారు. చెక్కులు పొందిన రైతులు బ్యాంకులలో నగదు కొరత రాకుండా బ్యాంకుల్లో నగదు నిల్వలు సమృద్ధిగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. చెక్కులు పొందిన రైతులు బ్యాంకులకు వెళ్లి నగదు పొందడానికి వీలుగా ప్రత్యేకంగా ఒక తేదీని కేటాయించారు. చెక్కులు పంపిణీ కేంద్రాల వద్ద షామియానాలు, కుర్చీలు, మంచినీరు ఏర్పాట్లు చేశారు.  ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పంపిణీ కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో తక్షణ వైద్య సేవలు అందజేసేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో సమస్యలు రాలేదు.
ఆధార్‌కార్డులేని రైతులకు ప్రత్యేకంగా ఆధార్‌కార్డులు మంజూరు చేయించాచి వారికి చెక్కులు పంపిణీ చేయించారు.  మొత్తంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం పూర్తి కావడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.