విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి

వెల్లడించిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు

హైదరాబాద్, నవంబర్ 7(జనంసాక్షి): తహసీల్దార్ విజయారెడ్డిని ఆఫీస్ లోనే పెట్రోల్ పోసి నిప్పటించి హత్య చేసిన నిందితుడు సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.25గంట సమయంలో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భూ పట్టా విషయంలో ఆమె ఆఫీస్ చుట్టూ తిరిగిన సురేష్ విసిగిపోయి పెట్రోల్ బాటిల్ తో తహసీల్దార్ కార్యాలయంకు వచ్చాడు. ఆమె గదిలోకి వెళ్లిన సురేష్ తలుపు మూసి ఆమెపై పెట్రోల్ చల్లి, తనపై కూడా చల్లకొని నిప్పటించుకున్నాడు. ఆ ఘటనలో విజయారెడ్డి – వెల్లడించిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అక్కడికక్కడే మృతి చెందగా, సురేష్ మాత్రం 60శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. సురేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా వైద్యులు అతన్ని వెంటిలేటర్ మీదికి మార్చి రెండు సార్లు ఈసీజీ తీశారు. రెండు సార్లూ ఈసీజీలో పల్స్ రేట్ ప్లాట్ గా రావడంతో హార్ట్ బీట్ ఆగిపోయినట్లుగా గుర్తించారు. కాగా సురేష్ సాయంత్రం 3:25 నిమిషాలకు మరణించినట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం సురేష్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా ఉదయమే సురేష్ మృతిచెందినట్లు వార్తలు రావటంతో ఉస్మానియా వైద్యులు వాటిని ఖండించారు. సురేష్ బతికే ఉన్నాడని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు తెలిపిన కొన్ని గంటల్లోనే సురేశ్ మృతిచెందాడు. అంతకు ముందు సురేశ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బంది తీరుపట్ల ఆందోళనకు దిగారు. సురేశ్ ను కడసారి చూపు చూసుకోనివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సురేష్ తల్లి మాట్లాడుతూ.. తన కొడుకొని చూడనివ్వటం లేదని, ఒక్కసారి చూద్దామన్నా లోపలికి వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.