విజయ్‌ మాల్యాకు ఎదురు దెబ్బ

– లీగల్‌ ఫీజుగా రూ.1.5కోట్లు చెల్లించాలని లండన్‌ కోర్టు ఆదేశం
లండన్‌, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : భారత్‌లో పలు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా దేశం విడిచి యూకేకు వెళ్లిపోయిన వ్యాపార వేత్త విజయ్‌ మాల్యాకు లండన్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భారత బ్యాంకుల కన్సార్టియంకు లీగల్‌ ఫీజుగా రూ.1.5కోట్లు చెల్లించాలని అక్కడి కోర్టు ఆదేశించింది. మాల్యా భారత్‌లోని వివిధ బ్యాంకులకు దాదాపు రూ.10వేల కోట్లు చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. లీగల్‌ ఫీజుల నిమిత్తం బ్యాంకుల కన్సార్టియంకు మాల్యా ఇప్పటికి రూ.1.8కోట్లు చెల్లించారు. ఇప్పుడు మరో రూ.1.5కోట్లు చెల్లించాలని కోర్టు తెలిపింది. దీంతో ఆయన లీగల్‌ ఫీజుల కింద బ్యాంకులకు రూ.3.3కోట్లు చెల్లిస్తున్నారు. మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై లండన్‌ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.కాగా, తాను భారత్‌కు వచ్చేందుకు, బ్యాంకులో సెటిల్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నానని ఇటీవల మాల్యా వెల్లడించారు. బ్యాంకులకు డబ్బు కట్టకుండా లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాకు సంబంధించిన కేసులపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తన ఆస్తులను, తన కంపెనీ యునైటెడ్‌ బ్రూవరీస్‌ ¬ల్డింగ్‌ లిమిటెడ్‌ కంపెనీ ఆస్తులను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని మాల్యా ఈ ఏడాది జూన్‌లో కోర్టును కోరారు. తన రూ.13,900కోట్ల ఆస్తులు అమ్మి అప్పులు తీరుస్తానని తెలిపారు. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పారిపోయిన ఆర్థిక నేరస్థుల జాబితాలో మాల్యాను చేర్చాలని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆయన ఆస్తులను జప్తు చేసి వేలం వేసి బ్యాంకుల రుణాలు తీర్చాలని అనుకుంటున్నాయి.