విత్తన సాగుపై దృష్టి సారించాలి

రైతులకు అన్నిరకాల ప్రోత్సాహకాలు: మంత్రి

నిజామాబాద్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): విత్తన ఉత్పత్తి చేసే రైతులు అధిక లాభాలను ఆర్జించేలా వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని మంత్రి ప్రశాంత రెడ్డి అన్నారు. రాష్టాన్న్రి విత్తన కేంద్రంగా మార్చు కోవడానికి సీఎం కేసీఆర్‌ పలు చర్యలు తీసుకొంటున్నారని, అందుచేత రైతులు లాభాలు ఆర్జించేందుకు ప్రోత్సాహం అందించాలని విత్తన కంపెనీలకు సూచించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు యాంత్రికసాగుపై దృష్టి సారించి అధిక లాభాలు వచ్చేలా కొత్త పద్ధతులు రూపొందించాలని పిలుపునిచ్చారు. అమెరికా వంటి దేశాల్లో యాంత్రికసాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధిస్తున్నారని, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు యాంత్రిక సాగుపై దృష్టిసారించి అధిక లాభాలు వచ్చే కొత్త పద్ధతులు రూపొందించాలని పిలుపునిచ్చారు. 50 వేల హెక్టార్ల పాలీహౌస్‌ సాగులక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్టాన్న్రి విత్తన కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం కెసిఆర్‌ అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. విత్తన ఉత్పత్తి విషయంలో తెలంగాణ జిల్లాలు అగ్రస్థానంలో నిలబడి ఎక్కువ మంది రైతులు విత్తన ఉత్పత్తిలో ఉంటారని అన్నారు. కంపెనీలు పక్క రాష్టాల్రకు తరలిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం విత్తన ఉత్పత్తికి రైతులతో ఒప్పందాలకు కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్నకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. మరికొంత విస్తీర్ణంలోనూ పంటలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించకపోవడం తోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ పాపం వారిదేనన్నారు. దేశంలో తొలిసారిగా పాలీహౌస్‌ సాగును హర్యానాలో ప్రారంభించారని, ఏడాదికి 150 ఎకరాల్లో సాగు చేస్తే.. తెలంగాణలో రెండేండ్లలో వేయిఎకరాల్లో సాగైందని మంత్రి తెలిపారు. మెదక్‌,నిజామాబాద్‌ జిల్లాల్లో పాలీహౌస్‌ సాగుచేస్తూ బాగా సంపాదిస్తున్నారని చెప్పారు. మరోవైపు వ్యవసాయ విద్యుత్‌ ఉచిత కనెక్షన్లు పెండింగ్‌ లేకుండా చూస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు కార్యాచరణ చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు న్యాయం జరుగుతోందని మంత్రి అన్నారు.