విద్య,వైద్య సేవలకు జీఎస్టీ మినహాయింపు

శ్రీనగర్‌,మే 19(జనంసాక్షి): కీలక రంగాలైన విద్య, ఆరోగ్య సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. శ్రీనగర్‌ లో శుక్రవారం జరిగిన రెండో రోజు సమావేశంలో కౌన్సిల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సేవల పన్నులపై రెండో రోజు సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌ లో చర్చించింది. సేవల్లో నాలుగు రకాల పన్ను రేట్లు నిర్ణయించారు. అవి 5, 12, 18, 28 శాతాలుగా ఉంటాయి. బంగారంపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. జూన్‌ 3న మరోసారి భేటీ కావాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ముగింపు సందర్భంగా జైట్లీ విూడియాతో మాట్లాడారు. ఏడాదికి 50 లక్షలు అంతకన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న రెస్టారెంట్లను ఐదు శాతం పన్ను పరిధిలోకి తెచ్చినట్లు జైట్లీ చెప్పారు. అయితే నాన్‌ ఏసీ రెస్టారెంట్లకు 12 శాతం, ఏసీ రెస్టారెంట్లు, మద్యం అనుమతి ఉన్న రెస్టారెంట్లు 18 శాతం, ఫైవ్‌ స్టార్‌ ¬టళ్లకు 28 శాతం పన్ను విధించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక వెయ్యి నుంచి 2500 టారిఫ్‌ ఉన్న ¬టళ్లు 12 శాతం పన్ను పరిధిలో ఉంటాయని చెప్పారు. ప్రస్తుత విధానంలో 30 శాతానికిపైగా పన్నులున్న వస్తువులు, సేవలను కూడా 28 శాతంలోపు తీసుకొస్తామని జైట్లీ వెల్లడించారు. మొత్తంగా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడమే లక్ష్యంగా తాము రేట్లు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. మరోవైపు క్యాబ్‌ సేవలు అందించే ఓలా, ఉబెర్‌లాంటి వాటిపై 5 శాతం పన్ను విధించనున్నారు. టెలికాం, ఆర్థిక సేవలు 18 శాతం పన్ను కేటగిరీలో, రేస్‌ క్లబ్‌, బెట్టింగ్‌, సినిమా హాల్స్‌ 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. దేశమంతా ఒకే పన్ను విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం జీఎస్టీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీతో నిత్యావసర ధరలు, తృణధాన్యాల రేట్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.