విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

వరంగల్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఖాళీగా ఉన్న ఉప, మండల విద్యాధికారి పోస్టులను కూడా భర్తీ చేయాలని టీఆర్టీయూ నాయకులు కోరారు. మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్‌కేర్‌ సెలవును రెండేళ్లకు పెంచాలన్నారు. పండిత్‌, పీఈటీల అప్‌గ్రేడ్‌ జీవో వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో హావిూ ఇచ్చిన మేరకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని రాష్ట్రప్రాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచితే మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పర్యవేక్షణ అధికారులు లేక విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఏళ్ల తరబడిగా ఖాళీలను భర్తీ చేయక పోవటంతో విద్యారంగం నిర్వీర్యం అవుతోందన్నారు. ముందు చూపు లేకుండా ప్రవేశ పెట్టిన సీసీఈ విధానం లోపభూయిష్టంగా ఉందని తెలిపారు. తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం శోచనీయమని పేర్కొన్నారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.