విద్యార్థుల మృతికి కేసీఆరే కారణం

– విద్యాశాఖ మంత్రి వైఫల్యం చెందాడు
– పోలీసులతో సమస్యను అణచివేయాలని చూస్తున్నారు
– విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్లెక్కుతున్నా కేసీఆర్‌ పట్టించుకోరా?
– కేసీఆర్‌ ప్రభుత్వానికి తగిన శాస్త్రి చెబుతాం
– కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి
– ఇంటర్‌ విూడియట్‌ బోర్డు ఎదుట రేవంత్‌, సంపత్‌ కుమార్‌ల ధర్నా
– అరెస్టు చేసి బేగంపేట స్టేషన్‌కు తరలించిన పోలీసులు
హైదరాబాద్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల పరిస్థితి తీవ్ర అయోమయంలో పడడానికి సీఎం కేసీఆరే కారణమని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఎదుట కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌లు సోమవారం ధర్నా చేపట్టారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుపట్టారు. అయితే పోలీసులు రేవంత్‌, సంపత్‌ను అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియ్‌ తప్పిదాల వల్ల 12మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్‌ ఏంచేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం తీరుతో వేలమంది విద్యార్థుల భవిష్యత్‌ ఆందోళనలో పడిందని, బాగా చదివే విద్యార్థులకు సున్నా మార్కులు వేసి వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రూ.1000 కట్టినవాళ్లకు రీవాల్యూయేషన్‌ చేసి వాళ్ల పేపర్లు వాళ్లకు ఇవ్వడానికి ఏంటి విూకొచ్చిన సమస్య అని ప్రశ్నించారు. ఇన్ని వేలమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు సవిూక్ష జరపడంలేదని ప్రశ్నించారు. సంబంధిత అధికారులతో మాట్లాడాల్సిన అవసరం లేదా.. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. ఇవాళ పేపర్ల వాల్యూయేషన్‌ లో అవకతవకల వల్లే ఇంతటి ఉపద్రవం వచ్చిపడిందని, ఆ పన్నెండు మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన మంత్రిగా వైఫల్యం చెందాడని, ఈ మొత్తం ప్రహసనానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. ఇవి ఆత్మహత్యలు కావని, ముఖ్యమంత్రి చేసిన హత్యలేనని ఇందుకు కేసీఆర్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం పారిపోయి, పోలీసులతో అణచివేయాలని చూస్తోందంటూ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు.