విద్యుత్‌ ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో అదనపు భారం

అధికారుల దృష్టికి తీసుకెల్లిన సిపిఎం నేతలు
కడప,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): వినియోగదారులపై డిజిటల్‌ చెల్లింపు భారాలను రద్దు చేయాలంటూ.. విద్యుత్‌ ఈసికి సిపిఎం నేతలు మంగళవారం వినతి పత్రాన్ని సమర్పించారు. కడప నగరంలోని విద్యుత్‌ భవన్‌లో ఉన్న ఈసి శివ ప్రసాద్‌ని, సిపిఎం నేతలు ప్రభాకర్‌ రెడ్డి, తిప్పిరిపాటి సునీల్‌, చంద్రారెడ్డిలతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్‌ మాట్లాడుతూ.. ఎస్‌పిడిసిఎల్‌ పరిధిలో ఉన్న వినియోగదారుల బిల్లులన్నీ ఫోన్‌ పే, పేటియం, తేజ్‌ లాంటి సంస్థల ద్వారా చెల్లించాలని అధికారులు కోరారని తెలిపారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయడం వల్ల ప్రతి బిల్లుపై సగటున 20 రూపాయల వరకూ భారం పడుతోందని, దీనిని తక్షణమే రద్దు చేయాలని కోరామని చెప్పారు. కడప జిల్లాలో ఏడు లక్షల 25 వేలకు పైగా వినియోగదారులు ఉన్నారని, వీరిలో 25 శాతం పైగా ఆన్‌లైన్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారని తెలిపారు. ఆ మేరకు సగటున నెలకు డిజిటల్‌ చెల్లింపుల పేరుతో 20 లక్షల అదనపు భారం వినియోగదారులపై పడుతుందన్నారు. ఎక్కువ మొత్తం బిల్లు వచ్చిన వినియోగ దారుడు నగదు తీసుకుని రెవెన్యూ కార్యాలయం వద్దకు వెళితే అక్కడ సిబ్బంది ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే చెల్లించాలని వెనక్కి పంపడం సమంజసం కాదన్నారు. దీని కారణంగా వినియోగదారుడు ఎక్కడైనా చెల్లించే ప్రాథమిక హక్కులను, సంస్థ హరిస్తుందన్నారు. సంస్థ అందిస్తున్న విద్యుత్తును వినియోగదారుడు వాడుకొని అందుకు అవసరమైన బిల్లులను సంస్థకు చెల్లిస్తున్నారని తెలిపారు. వినియోగదారుడికి ఎలాంటి సంబంధం లేని ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థలు లబ్ధి పొందే అవకాశం కనిపిస్తోందన్నారు. ఇలాంటి విధానాల వల్ల సంస్థ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని రామ్మోహన్‌ చెప్పారు. విద్యుత్‌ సంస్థ పరిరక్షణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమస్యను ఉన్నతాధికారుల దఅష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను కోరామన్నారు. డిజిటల్‌ లావాదేవీలపై అదనపు చార్జీలు వసూలు చేసే చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. లేని పక్షంలో ఆందోళన ఉధృతమవుతుందని రామ్మోహన్‌ హెచ్చరించారు. అనంతరం విద్యుత్‌ ఈసీ మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించేందుకు
ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు.