విద్యుత్‌ ఉత్పత్తిలో ఎన్టీపీసీ కీలకం

త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు
కరీంనగర్‌,మే3(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామగుండం ఎన్టీపీసీలో నిర్మిస్తున్న రెండు యూనిట్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీలో రాష్ట్ర ప్రభుత్వం 800 మెగావాట్ల చొప్పున నిర్మిస్తున్న రెండు యూనిట్ల విద్యుత్‌ ప్లాంట్‌ పనులను చేప్టటారు.  ఇవి పూర్తయితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. అందుకే ఎన్టీపీసి ఉత్పత్తిపై సిఎం కెసిఆర్‌ స్వయంగా ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు.  నిర్దిష్ట గడువులోపు విద్యుత్‌ ప్లాంట్లు పూర్తికావాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, వాటికి అవసరమయ్యే విద్యుత్‌ వంటి విషయాలను ఆరా తీస్తున్నారు.  ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యుత్‌ ప్లాంట్ల పనులు అదేస్థాయిలో ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్దిష్ట గడువులోపు రెండు యూనిట్లు పూర్తి అవుతాయా? లేదా అని అడిగి
తెలుసుకుంటున్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా ప్రకటించిన నేపథ్యంలో విద్యుత్‌
లభ్యతపై ఆరా తీయడం గమనార్హం.  2020 మే వరకు మొదటి యూనిట్‌ పనులు పూర్తిచేస్తామని ఎన్టీపీసీ అధికారవర్గాలు  ఇప్పటికే  తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విద్యుత్‌ అవసరాల దృష్ట్యా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశించిన లక్ష్యంలోగా పూర్తిచేయాలని బీఎచ్‌ఈఎల్‌ అధికారులను ఆదేశించారు.  పవర్‌ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణకు అవసరమైన నీరు అందించడంతోపాటు ఇతర సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే తెలిపారు.  మెటార్ల బిగింపు బాధ్యత తీసుకున్న బీఎచ్‌ఈఎల్‌ అధికారులతో ముఖ్యమంత్రి వాటి సామర్థ్యం పనితీరు, ఇతర అంశాలపై చర్చించారు. మోటర్ల బిగింపు ఎప్పటిలోపు పూర్తి అవుతుందని ఆరా తీశారు. మొత్తం ఏడు పంపు సెట్లలో వచ్చే జూన్‌ నాటికి రెండు, డిసెంబర్‌ నాటికి మొత్తం పంపుసెట్లు బిగిస్తామని బీఎచ్‌ఈఎల్‌ జీఎం గతంలోనే తెలిపారు.