విద్యుత్‌ బకాయిలపై స్పష్టత ఇవ్వాలి

సిద్దిపేట,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పంచాయతీలు రూ.3500కోట్ల విద్యుత్తు బకాయిలు ఉన్నాయని వీటికి సంబంధించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌ అన్నారు. కొత్తగా వచ్చిన సర్పంచ్‌లు వీటిని చెల్లించాలని అంటున్న ప్రభుత్వం అందుకు మార్గాలు చూపాలన్నారు. ప్రభుత్వం పన్నులు వసూలు చేసుకుంటూ  పంచాయతీలకు భారం మోపుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్ధలకు గుండుసున్నా చూపుతోందని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు బ్జడెట్‌లో ఎన్ని నిధులు కేటాయిస్తారనే దానిపై సీఎం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. సర్పంచుల విధులు, అధికారాల గురించి సీఎం వర్క్‌షాపు నిర్వహించి పలు అంశాలను ప్రస్తావించారన్నారు. సర్పంచులు అందుబాటులో పారదర్శకంగా ఉండాలని, ఈజీఎస్‌ ద్వారా మొక్కల పెంపకం చేపట్టాలని, విద్యుత్తు బకాయిలు ఉండకూడదన్నారు.  జిల్లా పరిషత్‌లు ఉత్సవ విగ్రహాలుగా ఉంటున్నాయని సీఎం చెబుతున్నారని, అధికార పార్టీ ఆధీనంలో ఉన్న వీటిని ఎందుకు బలోపేతం చేయడం లేదని ప్రశ్నించారు. స్థానిక సంస్ధలకు 29 శాఖలను బదలాయింపు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని చెప్పారు.