విద్యుత్‌ బస్సులు వచ్చేస్తున్నాయ్‌!

– హైదరాబాద్‌కు 100 విద్యుత్‌ బస్సులు
– వచ్చే నెలలో అందుబాటులోకి?
హైదరాబాద్‌, జులై12(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌ నగర వీధుల్లో చక్కర్లు కొట్టేందుకు త్వరలో విద్యుత్‌తో నడిచే బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ముందుగా జీహెచ్‌ఎంసీలో 300 వాహనాలను వినియోగించనున్నారు. ఆర్టీసీ ద్వారా ఎలక్టిక్ర్‌ బస్సులను నడిపేందుకు కసరత్తు జరుగుతోంది. మొదటి దశలో 100 బస్సులను ప్రారంభించనుండగా.. ఇప్పటికే 40 ఎలక్టిక్ర్‌ బస్సుల కొనుగోలుకు అంగీకారం కుదిరింది. ప్రస్తుతం ఒక్కో ఎలక్టిక్ర్‌ బస్సు వ్యయం 2కోట్ల 50 లక్షల రూపాయలు కాగా.. కేంద్రం సగం ఖర్చు భరించనున్నట్లు సమాచారం. మిగతా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి 100 ఎలక్టిక్ర్‌ బస్సులు కొనుగోలు చేయనున్నారు. ఛార్జింగ్‌ సమస్య కారణంగా మొదటి దశలో విమానాశ్రయ ప్రయాణికులకు మాత్రమే ఎలక్టిక్ర్‌ బస్సుల సేవలు అందిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఛార్జింగ్‌ పాయింట్లు లేవు. శంషాబాద్‌ విమానాశ్రయంలో 10, ఆర్టీసీ డిపోల్లో మరికొన్ని ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసి హైదరాబాద్‌ నుంచి విమానాశ్రయం వరకూ ఎలక్టిక్ర్‌ బస్సులు నడపనున్నారు. కొన్ని మెట్రో స్టేషన్‌ల వద్ద కూడా ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. అంతా సవ్యంగా సాగితే వచ్చే నెలలోనే  అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.