విద్యుద్దీపకాంతుల్లో శ్రీగోవిందరాజస్వామి ఆలయం

తెప్పలపై విహారం చేసిన స్వామివారు
తిరుపతి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. తెప్పలను అధిరోహించిన స్వామివారు శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా సోమ, మంగళవారాల్లో శ్రీగోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై ఏడు చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు.ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం, ఆలయ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో  ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి, ఇతర అదికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.