విద్వేషాలను రెచ్చగొట్టినందుకు అర్నాబ్‌ గోస్వామికి బ్రిటన్‌లో భారీ జరిమానా

లండన్‌, డిసెంబరు 23 (జనంసాక్షి):జర్నలిజానికి కొత్త అర్థాలు చెబుతూ, వివాదాస్పద ప్రసారాలతో నిత్యం వార్తల్లో నిలిచే రిపబ్లిక్‌ టీవీ యజమాని అర్నాబ్‌ గోస్వామికి భారీ షాక్‌ తగిలింది. ఇండియాలో ఆయన కార్యక్రమాలకు కోర్టులు, ప్రభుత్వాలు సైతం దన్నుగా నిలుస్తోన్నవేళ.. బ్రిటన్‌ లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనకు జనిమానా పడింది.గతేడాది ప్రసారం చేసిన ఓ కార్యక్రమంలో పాకిస్తాన్‌ ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిపబ్లిక్‌ టీవీ చానల్‌ చీఫ్‌ ప్రమోటర్‌ అర్నాబ్‌ గోస్వామికి చెందిన ‘రిపబ్లిక్‌ భారత్‌’ చానల్‌కు బ్రిటిష్‌ టీవీ నియంత్రణ సంస్థ ‘ఆఫ్‌కామ్‌’ 20వేల పౌండ్ల (భారత కరెన్సీలో రూ.19లక్షలు) జరిమానా విధించింది. బ్రిటన్‌లో హిందీ మాట్లాడే వారి కోసం ఆ దేశంలో అర్నాబ్‌ ‘రిపబ్లిక్‌ భారత్‌’ చానల్‌ అనుమతులు పొందారు. గత ఏడాది సెప్టెంబర్‌ 6న ఆ టీవీ చానల్‌లో ‘పూఛ్‌తా హై భారత్‌’ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చర్చలో అర్నాబ్‌ గోస్వామితో పాటు ముగ్గురు భారతీయులు, మరో ముగ్గురు పాకిస్తానీలు చర్చలో పాల్గొన్నారు. పాకిస్తానీలు తప్ప యాకర్‌ సహా ప్యానలిస్టులందరూ పాకిస్తాన్‌ ను, అక్కడి ప్రజలను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఆఫ్‌ కామ్‌ పేర్కొంది.’చంద్రయాన్‌-2′ మిషన్‌పై చర్చ సందర్భంగా.. భారత్‌ అంతరిక్ష, సాంకేతిక రంగంలో పురోగమిస్తూ, శాస్త్రవేత్తలను తయారుచేస్తుంటే.. పాకిస్తాన్‌ మాత్రం తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తూ టెర్రరిస్టుల్ని తయారుచేస్తోందని అర్నాబ్‌ వ్యాఖ్యానించారు. ఈ పోలికను బ్రిటన్‌ రెగ్యులేటరీ ఆఫ్‌కామ్‌ తప్పుపట్టింది. పాక్‌లోని పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ ఉగ్రవాదులేనన్న అర్థం వచ్చేలా ఆ కార్యక్రమంలో ఆయన మాట్లాడినట్టు ఆఫ్‌కామ్‌ తెలిపింది. భారీ జరిమానా విధించండంతోపాటు నాటి కార్యక్రమాన్ని మరోమారు ప్రసారం చేయొద్దని ఈ సందర్భంగా ‘రిపబ్లిక్‌ భారత్‌’ను ఆఫ్‌కామ్‌ హెచ్చరించింది.