విపక్షంలో ఇమడలేకనే అధికార పక్షం వైపుకు

ఉంటే అధికార పార్టీలో ఉండాలన్న సెంటిమెంట్‌ బలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. విపక్షంలో ఉంటే వేస్ట్‌ అన్న భావన కూడా బలంగా ఉంది. ఒకప్పుడు విపక్షనేతలే బలంగా ఉండేవారు. వారు కనుసైగల్లో ప్రభుత్వాన్ని శాసించేవారు. ఎక్కడ తమను అసెంబ్లీ వేదికగా నిలదీస్తారో అన్న భయం ఆనాడు ప్రభువుల్లో ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. ఉంటే అధికార పార్టీలోనే ఉండాలన్న యావ పెరిగింది. దీనికి పాలకులను నిందించడం సరికాదు. స్వతహాగా ఎంపిలు, ఎమ్మెల్యేలే పార్టీలు మారడానికి, అధికార పార్టీకి దగ్గర కావడానికి ఇష్టపడుతున్నారు. నియోజకవర్గ సమస్యలు మొదలు అనేకానేక అంశాలు ఇందులో కీలక భూమిక పోషిస్తున్నాయి. విపక్షంలో ఉంటే ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో క్యాడర్‌ను పోషించాలంటే భారీగా ఖర్చుతో కూడుకున్న పని. ఇకపోతే ఏదైనా పని కావాలంటే నేరుగా సిఎంతో టచ్‌లో ఉండాలి. అలా కావాలంటే అధికార పార్టీలో ఉండాలి. అందుకే గతంలో వైఎస్‌ అధికరాంలో ఉండగా ఆపరేషన్‌ ఆకర్శక్‌ అన్నారు. ఇప్పుడే అధికారిక ఆకర్శ్‌ అన్న విధంగా తయారయ్యింది. ఎన్నికకావడం, ఎన్నికయ్యాక అధికార పార్టీలో చేరడం ఇప్పుడు  సర్వసాధారణంగా మారింది. ఇది సమాజంలో వస్తున్న మార్పుగానే చూడాలి. ప్రజలు కూడా దీనిని తప్పుగా భావించడం లేదు. ఎందుకు పార్టీ మారావని అడగడం  లేదు. కొత్తగా ఏర్పడ్డ ఇరు తెలుగు రాష్టాల్ల్రోనూ ఇప్పుడు ఇలాంటి ఫిరాయింపు రాజకీయాల జోరు  కొనసాగుతోంది. అధికారంలో ఉన్న పార్టీలోకి చేరడం ద్వారా తామూ అధికార పక్షంలో ఉన్నమని అనిపుంచుకుంటున్నారు.  రాజకీయాల్లో విపక్షంలో ఎక్కువకాలం ఎక్కవమంది మనలేరు. కొందరు మాత్రమే ఎలాంటి సమయంఓల అయినా  విపక్షంలో ఉండగలరు. దీనికితోడు స్థానికంగా అభివృద్ది జరిగితేనే ప్రజలు ఆదరిస్తారు. ఇది జరగాలంటే అధికారపార్టీలో ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు ఇరు రాష్టాల్ల్రో అధికారంలో ఉన్నే టిడిపి,టిఆర్‌ఎస్‌ వైపు వెళ్లేందుకు ఇతర పార్టీల్లో ఉన్న నేతలు కండువాలు మారుస్తున్నారు. దీనిని ఆర్థికబంధంతో ముడిపెట్టడానికి వీలు లేదు. డబ్బులిచ్చి కొటంఉన్నారని జగన్‌ లాంటి వారు ఆరోపించినా, లేదా ఇతరులు తప్పుపట్టినా ఇందులో అంత సీన్‌ లేదు. ఇది రాజకీయాల్లో ఉన్న జాడ్యంగానే గుర్తించి ఊరుకోవాలి. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు మొదలెట్టారు. అయితే ఈ వికృత రాజకీయ క్రీడకు తెరతీసింది మాత్రం దివంగత రాజశేఖర్‌ రెడ్డే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఎదురుండకూడదన్న ఉద్దేశంతో అటు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇటు తెలుగుదేశం నాయకులకు వల విసిరారు. ఈ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు రెండు పార్టీలకు చెందిన పలువురు లొంగిపోయారు. ఆనాడు రాజశేఖర్‌ రెడ్డి మొదలుపెట్టిన ఆటను ఇప్పుడు ఉభయ రాష్టాల్ర ముఖ్యమంత్రులైన కేసీఆర్‌, చంద్రబాబు కొనసాగించే పనిలో ఉన్నారు. గతంలో కన్నా ఎక్కువ స్థాయిలో దీనిని కొనసాగిస్తున్నారు. అసలు ప్రతిపక్షం లేకుండానే పాలన చేయాలన్న తీరులో ఫిరాయింపులు సాగుతున్నాయి. తొలుత కొందరిని ఆకర్శించి ఉండవచ్చేమో కానీ చాలామంది ఇప్పుడు తమకుతాము గానే అధికార పార్టీకి ఆకర్శితులు అవుతున్నారు. దీనిని తప్పుపడుతున్న టిడిపి,కాంగ్రెస్‌,వైకాపాలు గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. నాడు ఆకర్షక్‌ తప్పు కానప్పుడు నేడు కూడా అది తప్పు కాకూడదు. ఒకసారి న్యాయం అయినప్పుడు మరోమారు అన్యాయం కాదు..కాకూడదు.  తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్‌- తెలుగుదేశం పార్టీలలో ఉన్న వారు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో కెసిఆర్‌ అభివృద్ది మంత్రిం, తెలంగాణ పునరేకీకరణ అన్న పిలుపు బాగా పనిచేస్తోంది. వెనకబడిన తమప్రాంతాలను అభివృద్ది చేసుకోవాలని అందిరికీ ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపే ఆలస్యం  రెండు పార్టీలలో ఉన్న నేతలు ఏకకాలంలో టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ అవుతున్నారు. దీనికితోడు తెలంగాణలో బలమైన ప్రతిపక్షం గానీ, కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అనగల నాయకుడు గానీ లేరు.  తెలంగాణ కాంగ్రెస్‌ లో అందరినీ కలుపుకొనివెళ్లగల నాయకత్వం ఆ పార్టీకి లేకుండా పోయింది. అదే సమయంలో అటు కేంద్రంలో కూడా పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. భవిష్యత్తుపై పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వగలిగే స్థితిలో ఎవ్వరూ లేరు. అధికారం అనుభవించిన పార్టీల నాయకులు సుదీర్ఘకాలం అధికారం లేకుండా అదే పార్టీలో కొనసాగడానికి మడికట్టుకుని కూర్చోలేదు.  పదేళ్లు అధికారం అనుభవించిన కాంగ్రెస్‌ నాయకులు మళ్లీ అధికారానికి దూరంగా ఉండలేక పోతున్నారు. ఆంధ్రాలో సైతం ఈ తరహా వ్యవహారమే సాగుతోంది. అక్కడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడంతో ఆయా పార్టీల నేతలు తమకోసం కాకున్నా తమ ప్రాంతం కోసం అన్న సూక్తిని ఆచరిస్తున్నారు. దీనికి జగన్‌ లేదా ఆయన అనుచరులు గగ్గోలు పెట్టాల్సిన పనిలేదు.  అందుకే  తొందరగా పార్టీ మారడం ద్వారా అధికారంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఎన్నికలప్పుడు వ్యక్తులుగా వీరు ప్రభావం చూపేస్థాయిలో ఎదురగుతున్నారు. అందుకే ఫలనా నియోజకవర్గంలొ ఆ వ్యక్తిదే హవా అన్నది బలంగా పాతుకుని పోయింది. పార్టీలకన్నా వ్యక్తులకు ప్రాధాన్యం పెరుగుతోంది.అందువల్ల ఫిరాయింపులు అన్న పదానికి  అర్థం మారి,  ఇష్టమైన వారు ఇష్టమైన చోట ఉంటారనుకోవాలి.  అందుకే అభివృద్ది మంత్రం అన్నది అందరూ జపిస్తున్నారు. తాజాగా గుత్త సుఖేందర్‌ రెడ్డి, వివేక బ్రదర్స్‌, సిపిఐ ఎమ్మెల్లే చేరికలను అవసరార్థం అన్న కోణంలో చూడాల్సిందే.